ఆటపాటలతో తెలంగాణకు కొత్త శోభ

తెలంగాణ పల్లె పండుగ బతుకమ్మ రానే వచ్చింది. పూలు దేవతలుగా రూపుదాల్చి నీరాజనాలు అందుకునే ఈ పండుగతో ఊరూవాడా శోభాయమానం అవుతుంది..ప్రతీ గడపా నిత్యనూతనంగా అలరారుతోంది. బంధాలు, అనుబంధాలు పరస్పరం పలకరించుకొని కొత్త కాంతులతో పల్లె వెలుగులీనుతుంది. భాద్రపద అమావాస్య నుంచి అశ్వయుజ శుద్ధ అష్టమి లేదా నవమి వరకు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మగా ప్రారంభమై చివరి రోజున సద్దుల బతుకమ్మగా ముగుస్తుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలందరూ ముస్తాబై..తంగేడు, గునుగు, కట్ట గుమ్మడి, గన్నేరు, బంతి, చామంతి తదితర పూలతో బతుకమ్మలను అలంకరించి ఆటపాటలతో బతుకమ్మను కొలుస్తారు. ఆటపాటల తర్వాత ప్రసాదాలు పంచుకొని, వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటారు. పండుగను అయినవారితో జరుపుకునేందుకు ఎక్కడెక్కడో ఉన్న ఆడపడుచులు పుట్టింటికి చేరుకుంటారు. తోబుట్టవులు, బంధువులతో తొమ్మిది రోజులు ఉల్లాసంగా గడుపుతారు.