వాజ్ పేయి అసమర్ధుడు కాదు....మానవాతావాది

 

గతంలో పుల్వామాలో సైనికుల మీద పాక్ లో తలదాచుకున్న ఉగ్రవాద సంస్థ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌ ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన దాడుల గురించి తెలిసిందే. ఈ దాడుల గురించి ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెబుతుంటారు. అసలు దాడులే జరగలేదని పాకిస్తాన్ చెప్పగా, భారత్ దాడులతో పెద్దగా నష్టం జరగలేదని అప్పట్లో అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది. మరో వైపు బీజేపీ మాత్రం బాలాకోట్‌ లో మూడు వందల మంది ఉగ్రవాదులు మృతి చెందారని ప్రచారం చేసింది.  

ఏది ఏమైనా జైషే మహమ్మద్ స్థావరంపై మెరుపు దాడులు చేయించటం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ మన దేశ పరువుప్రతిష్టలను ఇనుమడింపజేశారని, ప్రపంచం దృష్టిలో మన గౌరవ మర్యాదలను మరింతగా పెంచారు. వ్యూహాత్మకంగా చేసిన వైమానిక దాడి ద్వారా పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పారని విశ్లేషకులు మోడీని పొగిడారు. అలాగే పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ధైర్యంతో వ్యవహరించలేదని, అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి పాకిస్తాన్‌ ని భయపెట్టలేక పోయారని విశ్లేషకుల వాదన.

పాక్‌పై యుద్ధానికి సన్నద్ధం అన్నట్టుగా సైన్యాన్ని సరిహద్దులకు తరలించినా ఆ తరువాత ఎందుకో వాజపేయి వెనక్కి తగ్గారు. అమెరికా ఒత్తిడి వల్ల పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడంలో వెనుకంజ వేసినందుకు గాను వాజపేయి ప్రతిష్ట తగ్గిందని అప్పటి విశ్లేషకులు ఏవేవో చెబుతూ ఆయన ప్రతిష్ట దిగజార్చే వ్యాఖ్యలు, విశ్లేషణలు చేశారు. అయితే దీని వెనుక కారణం ఏమిటి అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. నిజానికి 13 డిసెంబరు 2001లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ భారత పార్లమెంటుపై దాడికి పాల్పడింది. 

దేశం మొత్తాన్ని పట్టి కుదిపివేసిన ఈ దాడి తర్వాత అప్పటి ప్రధాని వాజ్‌పేయి పాకిస్థాన్ ఆర్మీ ఆధ్వరంలో నడుస్తున్న ఉగ్ర స్థావరాలపై బాలాకోట్ తరహా వాయు దాడులు చేయాలని భావించారట. జైషేకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడికి దిగి తొమ్మిది మందిని చంపిన తర్వాత త్రివిధ దళాధిపతులు అప్పటి రక్షణ శాఖా మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌ను, జాతీయ భద్రతా సలహాదారు బ్రజేశ్ మిశ్రాను కలిసి చర్చించారట. ఈ సమయంలోనే  పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాలని నిర్ణయించి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేయాలన్న నిర్ణయానికి వచ్చారట. 

మిరేజ్-2000 ఫైటర్ జెట్స్‌తో ఈ దాడికి రూపకల్పన కూడా జరిగిందని అయితే భారత్ దాడులకు సిద్ధమయ్యే అవకాశం ఉందని ముందే గ్రహించిన పాకిస్థాన్ ఆర్మీ జైషే ఉగ్ర స్థావరాలను ఓ స్కూలు, మరో పెద్ద ఆసుపత్రి మధ్యలో ఏర్పాటు చేయడంతో ఈ దాడుల విషయంలో వెనక్కి తగ్గాల్సి వచ్చిందట. దాడి కారణంగా ఊహకు అందని నష్టం వాటిల్లే అవకాశం ఉండడంతో ఆ ఆలోచనను విరమించుకోవాల్సి వచ్చిందని, భారత ఆర్మీని ఆరునెలల పాటు బోర్డర్ లో ఉంచి కూడా వెనక్కి రప్పించడానికి అదే కారణం అన్నమాట. 

అయితే అప్పుడు వెలుగులోకి రాని విషయాలను ఇప్పుడు వెలుగులోకి ఎలావచ్చాయంటే ఈ విషయాలను అన్నిటినీ ఏ ప్రైమ్‌ మినిస్టర్‌ టు రిమెంబర్‌: మెమరీస్‌ ఆఫ్‌ ఏ మిలటరీ చీఫ్‌ పేరుతో అప్పటి నౌకాదళాధిపతి సుశీల్‌ కుమార్‌ రాసిన పుస్తకంలో ఈ విషయాలు పేర్కొన్నారు. ఆ పుస్తకం శుక్రవారం విడుదలయింది. ఈ పుస్తకంలోనే ఆయన ఈ విషయాలు అన్నీ రాసుకొచ్చారు. నిజానికి అప్పట్లో రక్షణ, దేశ దౌత్యంకి సంబందించిన విషయాలు అన్నీ రహస్యంగా ఉంచేవారు. ఇప్పటిలా అప్పుడు మీడియా ప్రాబల్యం లేనందువలన ఇలాంటి విషయాలు వెలుగులోకి వచ్చేవి కావు, కానీ ఇవేమీ పట్టని విశ్లేషకులు ఒక సమర్ధ ప్రధానిని కూడా అసమర్ద ముద్ర వేసి ప్రచారం మాత్రం చేస్తారు.