శాసనసభలో టీ-బిల్లుపై చర్చ జరిగేనా

 

తెలంగాణ బిల్లు రాష్ట్ర శాసనసభకు వచ్చిన నాటి నుండి నేటి వరకు వైకాపా ముందుగా సభలో సమైక్యాంధ్ర తీర్మానం చేసిన తరువాతనే చర్చ మొదలుపెట్టాలని వితండవాదం చేస్తూ, బిల్లుపై చర్చ మొదలవకుండా అడ్డుకొంటోంది. ఈరోజు ఉభయ సభలలో వైకాపా సభ్యులను సస్పెండ్ చేయడంతో బిల్లుపై చర్చ మొదలయింది. ఈ పని మొదటే చేసి ఉంటే విలువయిన సభా సమయం, ప్రజాధనం వృదా అయ్యేవి కావు.

 

ప్రస్తుతం సభలో చర్చ మొదలయినప్పటికీ, అది ఎంతకాలం సజావుగా సాగుతుందో చెప్పలేము. ఒకవేళ సజావుగా సాగినా, సభ్యుల ఊకదంపుడు ప్రసంగాలతో, చరిత్ర పాటాలతో పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతుంది. ఈ నెల13 నుండి 16వరకు సంక్రాంతి పండుగ సందర్భంగా శాసనసభ సమావేశాలు జరుగవు. అంటే బిల్లుపై అర్ధవంతమయిన చర్చ జరపడానికి ఇంకా కేవలం 10రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందన్నమాట. దాదాపు నెల రోజులపాటు సమయం వృధా చేసుకొని ఇప్పుడు ఈ మిగిలిన కొద్ది రోజులలో మన ప్రజాప్రతినిధులు బిల్లుపై లోతుగా చర్చించగలరని ఆశించలేము.

 

ఉభయ సభలలో బిల్లుపై లోతుగా చర్చ జరగవలసి ఉన్నపటికీ, తమతమ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చే మన ప్రజాప్రతినిధులు, తమ పార్టీ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని భావిస్తే సభను ఏ నిమిషంలోనయినా స్తంభింపజేయవచ్చును. చర్చ యావత్తు రాష్ట్ర విభజనపైనే జరుగుతోంది గనుక సీమాంధ్ర శాసనసభ్యులు లేవనెత్తే అంశాలను తెలంగాణా సభ్యులు అడ్డుకోవడం తధ్యం. అదేవిధంగా ప్రతిపక్షాలు కాంగ్రెస్ అధిష్టానంపై విమర్శలు చేయడం, ఆ వెంటనే తెలంగాణా కాంగ్రెస్ సభ్యులు ఎదురుదాడికి దిగడంతో చర్చ పక్కదారి పట్టగానే సభలో మళ్ళీ వాయిదాల పర్వం మొదలవవచ్చును. ఈలోగా పుణ్యకాలం కూడా పూర్తయిపోతుంది.