సం‘క్షేమమే’ లక్ష్యం
Published on: Sat Feb 18, 2012 9:02AM
హైద
రాబాద్: రానున్న అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం రాష్ట్ర బడ్జెట్పై స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించే విధంగా ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం శాసనసభకు సమర్పించిన 2012-13 రాష్ట్ర వార్షిక బడ్జెట్లో సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారు. గత బడ్జెట్లో కన్నా కొత్త బడ్జెట్లో సంక్షేమ రంగాలకు నిధుల కేటాయింపును పెంచారు. మొత్తంమీద 225 కోట్ల రూపాయల మిగులుతో బడ్జెట్ను ప్రతిపాదించారు. వార్షిక బడ్జెట్ రూపొందించడంలో ప్రణాళికా కేటాయింపులకంటే ప్రణాళికేతర కేటాయింపులకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుంటే రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించలేక పోయారని స్పష్టమవుతోంది. గత ఐదేళ్ల నుంచి వార్షిక ప్రణాళికలను పరిశీలిస్తే ప్రణాకేతర వ్యయం విపరీతంగా పెరిగిపోతోందని స్పష్టమవుతోంది.
రాష్ట్ర ఖజానాకు 2012-13 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం 1,46,265.56 కోట్ల రూపాయలుగా ఉంటుందని, ఖర్చు 1,45,854.66 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. అంటే 410 కోట్ల రూపాయలు మిగులు తేలుతుంది. 2011-12 ఆర్థిక సంవత్సరం 185 కోట్ల లోటుతో ముగుస్తుందని అంచనా వేయడంతో, ఈ లోటును పరిగణనలోకి తీసుకుంటే 2012-13 సంవత్సరం 225కోట్ల మిగులుతో ముగుస్తుందని ఆనం వెల్లడించారు.2011-12లో రూపాయికే కిలో బియ్యంతో సహా సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. రైతులకు లక్ష రూపాయల వరకు, స్వయం సహాయ గ్రూపులకు వడ్డీలేకుండా రుణాలు ఇప్పిస్తున్నామని తెలిపారు. రైతులకు, మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, వడ్డీలేని రుణాల పథకం కోసం ప్రభుత్వ ఏటా 1075 కోట్ల రూపాయలు భరిస్తుందన్నారు. మహిళకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు 100 కోట్ల రూపాయలతో ‘స్ర్తినిధి’ (స్ర్తినిధి పరపతి సహకార సమాఖ్య లిమిటెడ్)ను ఏర్పాటు చేశామన్నారు.
గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఇందుకోసం 2012-13 సంవత్సరానికి 4,703 కోట్లు కేటాయించామని ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. సాగునీటికి 2004-05 నుంచి 2011-12 వరకు 71,292 కోట్లు కేటాయించగా, 2012-13 సంవత్సరానికి 24,135 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. చేనేత రంగం అభివృద్ధి తదితర అవసరాలకు 2012-13 సంవత్సరానికి 633 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఓడరేవులు, విమానాశ్రయాలు తదితర వౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు చెప్పారు. ఐటి రంగాన్ని మండలస్థాయి వరకు తీసుకెళ్లేందుకు వీలుగా ఈ రంగానికి 151కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. ఇంధన రంగానికి 2012-13లో 5937 కోట్లు కేటాయించారు. ఆర్టీసి 6000 కొత్త బస్సులు కొనుగోలు చేయడంతోపాటు రోడ్ల నిర్మాణం తదితర అవసరాలకు రవాణా, రోడ్లు భవనాల శాఖకు 5032 కోట్ల రూపాయలు కేటాయించారు. పట్టణాల్లో మురికివాడల అభివృద్ధి, నీటిసరఫరా తదితర అవసరాలకుగాను పట్టణాభివృద్ధి కోసం 6586 కోట్ల రూపాయలు కేటాయించారు. రాష్ట్రంలోని మొత్తం విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణాన్ని 33శాతానికి పెంచేందుకు వీలుగా పర్యావరణ, అటవీ అభివృద్ధి కోసం 524 కోట్ల రూపాయలు కేటాయించారు. పాఠశాల విద్యకు 15,510 కోట్లు, సాంకేతిక విద్యకు 1087 కోట్లు, ఉన్నత విద్యకు 1841 కోట్ల రూపాయలు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి తెలిపారు.
సంక్షేమంలో భాగంగా సాంఘిక సంక్షేమానికి 2,677 కోట్లు, గిరిజన సంక్షేమానికి 1540 కోట్లు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 2,101 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే మహిళా సంక్షేమానికి 2,283 కోట్ల రూపాయలు మైనారిటీల సంక్షేమానికి 489 కోట్ల రూపాయలు కేటాయించామని ఆనం వెల్లడించారు. ప్రస్తుతం వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న 12.55 లక్షల గృహాలతో పాటు రచ్చబండ-2 సందర్భంగా మంజూరు చేసిన ఆరు లక్షల గృహాలకు కలిపి 2012-13 సంవత్సరానికి 2,302 కోట్ల రూపాయలు కేటాయించామని ఆర్థిక మంత్రి తెలిపారు. కార్మిక, ఉపాధి శాఖకు 500 కోట్లు కేటాయించారు. పర్యాటక, సాంస్కృతి శాఖకు 200 కోట్ల రూపాయలు, క్రీడలకు 220 కోట్ల రూపాయలు కేటాయించారు. వైద్య ఆరోగ్య శాఖకు 2012-13 సంవత్సరానికి 5,889 కోట్ల రూపాయలు కేటాయించారు. స్థానిక సంస్థలకు 175 కోట్లు కేటాయించారు. శాంతి, భద్రతలు, అగ్నిమాపక దళం కోసం 4,832 కోట్లు కేటాయించారు. తహశీల్ కార్యాలయ భవనాల కోసం 20కోట్ల రూపాయలు కేటాయించామని ఆనం వెల్లడించారు.
రాష్ట్ర వార్షిక బడ్జెట్లో ప్రధాన శాఖలకు
ప్రణాళికా కేటాయింపులు (కోట్లలో)
శాఖ 2011-12 2012-13
నీటిపారుదల 15,010 15,013
పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధి 4,953 5,855
విద్యాశాఖ 4,461 4,799
పురపాలన, పట్టణాభివృద్ధి 3,676 6,856
రవాణా, రోడ్లు, భవనాలు 2,676 3,210
గృహనిర్మాణం 2,300 2,300
వ్యవసాయం, సహకారం 2,148 2,819
వైద్యం, ఆరోగ్యం 2,117 2,364
స్ర్తి, శిశు సంక్షేమం 1,856 2,282
సాంఘిక సంక్షేమం 1,549 1,719
గిరిజన సంక్షేమం 692 1,013
మైనారిటీ సంక్షేమం 295 482
బిసి సంక్షేమం 1,502 2,656
ప్రణాళికా శాఖ 1,023 1,143
పశుసంవర్ధనం, మత్స్యశాఖ 370 504
రెవెన్యూ శాఖ 226 399
యువజన, టూరిజం 168 343
న్యాయశాఖ 14 102
ఐటి అండ్ సి 48 148


