TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సభలో కొనసాగుతున్న వాయిదాల పర్వం

Published on: Wed Feb 15, 2012 9:05AM

హైదరాబాద్: అసెంబ్లీలో వివిధ సమస్యలపై ప్రతిపక్షాలు బుధవారం వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టాయి. తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు భారతీయ జనతాపార్టీలు తెలంగాణపై తీర్మానం చేయాలంటూ వాయిదా తీర్మానం అందజేశాయి. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీని ఇప్పటికైనా నెరవేర్చుకోవాలని కోరుతున్నాయి. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటూ సీపీఐ వాయిదా తీర్మానం అందజేయగా కరవు మండలాలపై చర్చ కోరుతూ సీపీఎం, మద్యం సిండికేట్లపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.

సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. దాంతో విపక్ష సభ్యులు వాయిదా తీర్మానాలపై చర్చ చేయాలంటూ నిరసన తెలిపారు. దాంతో సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ సభ్యుల్ని కోరారు. టీఆర్ఎస్, టీడీపీ సభ్యులు ఫ్లకార్డులతో స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సభ అరగంటపాటు వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే మద్యం సిండికేట్లలో ప్రమేయం ఉన్న మంత్రులను తొలగించాలని టీడీపీ, తెలంగాణపై తీర్మానం చేయాలంటూ తెరాస సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు.

ఈ సందర్భంగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకుని మద్యం సిండికేట్లపైనే కాదని ఏఅంశంపైన అయినా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అయినప్పటికి పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవటంతో స్పీకర్ సభను అరగంట వాయిదా వేశారు. ఈరోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగాల్సి ఉంది. కాగా సభ సజావుగా సాగేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు అన్నిపార్టీల ఫ్లోర్ లీడర్లను స్పీకర్ తన ఛాంబర్కు ఆహ్వానించారు. కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిశారు.