'అనంత'లో రూ.3 కోట్ల దోపిడీకి రంగం సిద్దం
Published on: Mon Feb 13, 2012 3:58PM
వ్యవసాయశాఖపై కీలక నేత ఒత్తిడి
అనంతపురం: అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తన శుద్ధి మందు పంపిణీ మాటున ఒక పంపిణీ సంస్థ 3 కోట్ల రూపాయలు దోపిడీకి రంగం సిద్దం చేసింది. సబ్సిడీపై పంపిణీ చేయని విత్తనశుద్ధి మందును కూడా రైతు ఖాతాలో వేసి దోచుకునే ప్రయత్నంలో ఉంది. ఈ మేరకు యూసి జారీ చేయాలని వ్యవసాయశాఖ అధికారులపై జిల్లాకు చెందిన కీలక నేత ఒకరు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. గత ఖరీఫ్ సీజన్ లో సబ్సిడీ వేరుశనగ విత్తనం పంపిణీని వ్యవసాయశాఖ చేపట్టింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.5 లక్షల క్వింటాళ్ళ వేరుశనగ విత్తనాలను పంపిణీచేశారు. అవసరమైన విత్తనశుద్ధి మందును కూడా సబ్సిడీపై అందించాలి, అయితే ఈ మందును అందించకుండానే ఇప్పుడు బిల్లులు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పంపిణీ సంస్థ ఈ మందును రైతులకు పంపిణీ చేసినట్లుగా తప్పుడు రికార్డులు సృష్టించింది. ఈ రికార్డుల ఆధారంగా డబ్బు చెల్లించాలంటూ జిల్లాకు చెందిన ఒక మంత్రి వ్యవసాయశాఖపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఈ ఒత్తిడికి వ్యవసాయశాఖ తలొగ్గితే సుమారు రూ.3 కోట్ల ప్రజాదనం అక్రమార్కుల జేబుల్లోకి వెళుతుంది.


