సీఎం కేసీఆర్‌పై కేసు!.. బీజేపీ దూకుడు.. ఇక తగ్గేదేలే..
Published on: Tue Feb 15, 2022 2:48PM
కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై హైదరాబాద్ లో కేసు నమోదైంది. అలాగే.. భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించిన ఆధారాలేంటని ప్రశ్నించిన తెలంగాణ సీఎం కేసీఆర్ పైన కూడా అసోంలో కేసు నమోదుకు రంగం సిద్ధమైంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహిళలను అవమానించేలా మాట్లాడిన హిమంత బిశ్వశర్మపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రేవంత్ రెడ్డి సోమవారంనాడు జూబ్లీహిల్స్ పోలీసులను కోరారు. 48 గంటల పాటు చూస్తామని, అప్పటి వరకు కేసులు నమోదు చేయకపోతే పీఎస్ లు ముట్టడిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ నెల 16వ తేదీ 12 గంటలలోగా అసోం సీఎం హిమంత బిశ్వశర్మను అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
కాగా.. భారత సైన్యం సర్జికల్ స్టరైక్స్ కు ఆధారాలు కావాలని డిమాండ్ చేయడంతో పాటు, జాతి వ్యతిరేక సెంటిమెంట్లను రగిలిస్తున్నారనే కారణంపై తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేసులు నమోదు చేయనున్నట్లు ఆ రాష్ట్ర పోలీసు వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ మేరకు పలువురు బీజేపీ మద్దతుదారుల నుంచి పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు అందాయని వారు వెల్లడించారు. మొత్తం మీద అసోం సీఎంపై తెలంగాణలోను.. తెలంగాణ సీఎంపై అసోంలోనూ కేసుల నమోదు చర్చనీయాంశంగా మారుతున్నాయి.


