అసోంలో అగ్గి… పార్లమెంట్లో పొగలు!

మన రాజకీయ నేతల అసలు స్వరూపం నిజమైన సమస్యలొచ్చినప్పుడే బయటపడుతుంది! ప్రస్తుతం పార్లమెంట్ ను కుదిపేస్తోన్న అసోం పౌరసత్వ ముసాయిదా జాబితానే ఇందుకు మంచి ఉదాహరణ! స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ బాంగ్లాదేశ్ తో వున్న సరిహద్దు రేఖ వెంట సంక్షోభం ముదురుతూనే వుంది. అదిప్పుడు పాకాన పడింది. సుప్రీమ్ కలుగజేసుకుని నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) తయారు చేయమని ఆదేశించింది. మంచికో, చెడుకో ప్రస్తుతం అసోంలో వున్న బీజేపీ ప్రభుత్వం ఆ పని చేస్తోంది. తనకు దశాబ్దాలపాటూ అధికారం ఇస్తే ఏమీ చేయని కాంగ్రెస్ ఇప్పుడు సెక్యులర్ వీరావేశం ప్రదర్శిస్తోంది. మరోవైపు మోదీకి నేనే తగిన ప్రత్యర్థినని ఫీలయ్యే మమతా బెనర్జీ ఆవేశంతో ఊగిపోతోంది. దేశ సార్వభౌమత్వం, భద్రతా ఏమైపోయినా తమ ఓట్ల లెక్కలు తామే వేసుకుంటున్నారు అన్ని పార్టీల వారు! కేవలం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మమతా బెనర్జీలు కొన్ని గంటల వ్యవధిలో మాట్లాడిన మాటలు చూస్తే ఎవరి బాధ్యతా రాహిత్యం ఎంత వుందో తెలిసిపోతుంది!

 

 

ఇంతకీ… ఎన్ఆర్సీ అంటే ఏంటి? భారతదేశం బ్రిటీషర్ల చేతి నుంచీ విముక్తి పొందిన తరువాత మూడు ముక్కలైంది. ఒకవైపు పాకిస్తాన్ ఏర్పడగా, మరోవైపు బెంగాల్ ను చీల్చి తూర్పు పాకిస్తాన్ గా వదిలేసి వెళ్లారు తెల్లవాళ్లు. తరువాత అదే తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా మారింది. కానీ, అప్పటి నుంచీ నిరంతరం సరిహద్దు వెంట బంగ్లాదేశీయులు ఇండియాలోకి వచ్చేస్తూనే వున్నారు. పాకిస్తాన్ వెంట మనకున్న బార్డర్ లాగా బంగ్లాదేశ్ వైపున గట్టి భద్రత వుండదు. నెహ్రు కాలం నుంచీ మన్మోహన్ దాకా ఏనాడూ అక్రమంగా భారత్ లోకి వస్తోన్న బంగ్లాదేశీయుల్ని ఎవ్వరూ అడ్డుకోలేదు. వాజ్ పేయ్ కాలంలో ఆడ్వాణీ కాస్త ప్రయత్నించారు. కానీ, తమ ఓట్ల కోసం బంగ్లాదేశ్ నుంచి వచ్చే వారిని మరే ఇతర దిల్లీ పాలకులు అడ్డుకోలేదు. ముఖ్యంగా, అసొంలో కాంగ్రెస్ కు అండగా వుంటారన్న ఆశతో అక్రమ బంగ్లాదేశీయుల్ని యధేచ్ఛగా రానిచ్చింది హస్తం పార్టీ. ఇప్పుడదే అసోంలోని అనేక వర్గాల ప్రజలకి తీవ్ర సమస్యగా మారింది…

 

 

కాంగ్రెస్ సెక్యులర్ మార్కు మైనార్టీ రాజకీయం ఎలాంటిదో బీజేపీ హిందూత్వ ఎజెండా కూడా అలాంటిదే. ఇది కొత్తదేం కాదు. అసోంలో హిందూత్వ శక్తుల్ని ఏకం చేస్తూ కమలం రాజకీయం నడిపి ఎట్టకేలకు అధికారంలోకి వచ్చింది. అయితే, సుప్రీమ్ అదేశంతో నిజమైన అసామీలు ఎవరూ, అక్రమ బంగ్లాదేశీయులు ఎవరూ అనే తేల్చే పనిలో పడింది. ఇది ఎప్పుడో కాంగ్రెస్ పాలకులు చేసి వుంటే ఇంత సమస్య వచ్చేది కాదు. కానీ, వారు చేయక కాషాయ పార్టీ రంగంలోకి దిగటంతో ఇప్పుడు వివాదాలు రాజుకుంటున్నాయి. దాదాపు నలభై లక్షల మంది పౌరులు కాదని తేల్చింది ముసాయిదా జాబితా. వీరిలో మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ కుటుంబీకులు కూడా వున్నారు. ఇంకా ఒక ఎమ్మెల్యేతో సహా చాలా మందే వున్నారు. మోదీ సర్కార్ కానీ , సుప్రీమ్ కోర్టు కానీ ఈ ముసాయిదా జాబితేనే ఫైనల్ కాదని చెబుతున్నప్పటికీ కాంగ్రెస్, టీఎంసీ వంటి పక్షాలు దొరికిన అవకాశాన్ని పార్లెమెంట్లో రచ్చకి విచ్చలవిడిగా వాడుకుంటున్నాయి!

 

 

అసోం పౌరసత్వ జాబితా వివాదంపై రాజ్యసభలో మాట్లాడిన బీజేపి అధ్యక్షుడు షా తనదైన స్టైల్లో కామెంట్లు చేశారు. నలభై లక్షల మందిలో వున్న అక్రమ బంగ్లాదేశీయుల పై మన పార్టీలకు, నేతలకు ఎందుకంత ప్రేమ అంటూ రాజకీయ పంచ్ లు వేశారు. దీనికి రెచ్చిపోయిన ప్రతిపక్షాలు సభను అడ్డుకుంటూ వస్తున్నాయి. ఇంతలోనే ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ మరింత దారుణమైన కామెంట్లు చేసింది. తనను తాను మోదీ తరువాత ప్రధాని అభ్యర్థిగా జనం ముందుకు తెచ్చుకునే ఆవేశంలో వున్న ఆమె అసోం పౌరసత్వ జాబి లేదా ఎన్ఆర్సీ వల్ల  అంతర్యుద్ధం వస్తుందని తేల్చేసింది. రక్తపాతం తప్పదని పేర్కొంది. ఇది ఎంత బాధ్యతారాహిత్యం?

మమతా బెనర్జీ లాంటి ఒక అతి పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి సుప్రీమ్ పర్యవేక్షణలో జరుగుతోన్న పనిని తప్పుబట్టడం… పైగా పౌర యుద్ధం, రక్తపాతం లాంటి పదాలు వాడటం చాలా ప్రమాదకరం! దాని వల్ల జాబితాలో చోటు దక్కని చాలా వరకూ ముస్లిమ్ లైన వారు హింసకు దిగితే ఎవరిది బాధ్యత? అలాగే, ఆమె మాటలు ఆదేశాలుగా తీసుకుని తృణమూల్ శ్రేణులు అరాచకాలు చేస్తే పరిస్థితి ఏంటి? అవన్నీ మమతా బెనర్జీ ఆలోచించే స్థితిలో లేరు. బీజేపీ బెంగాల్లో పునాదులు వేసుకుంటోంది. కాబట్టి అక్కడి ముస్లిమ్ ఓట్లు ఆమెకు ముఖ్యం. అందుకే, సెక్యులర్ వీరావేశం ప్రదర్శిస్తున్నారు. జాబితాలో చోటు దక్కని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని ఎంత చెప్పినా వినటం లేదు! సుప్రీమ్ కోర్టు పర్యవేక్షణ వున్నా కూడా మమతా బెనర్జీ లాంటి వారు బీజేపిని చూసి అనుమానించటం ఆపటం లేదు!

 

 

నిజంగా ఒక్కసారి ఈ అసోం పౌరసత్వ జాబితా సంగతి చూస్తే మన దృష్టికి వచ్చేది ఆ రాష్ట్ర స్థానిక తెగలు, బెంగాలీలకు నడుమ జరిగి నిత్య సంఘర్షణ. అది పైకి కనిపించినంత హిందూ, ముస్లిమ్ గొడవ కాదు. అసోం స్థానికులు బెంగాలీల్ని దశాబ్దాలుగా వ్యతిరేకిస్తారు. ఎలాగైతే మరాఠీలు హిందీ మాట్లాడేవారిని తరమాలని భావిస్తారో అలాగే అసామీలకు బెంగాలీలంటే పడదు. వారు బెంగాల్ వారైనా కావచ్చు, బంగ్లాదేశీయులైనా కావచ్చు. ఇది గమనించి కూడా యథేచ్ఛగా అసోంలోకి వలసల్ని ప్రొత్సహించారు గత పాలకులు. ఇప్పటికైనా సుప్రీమ్ నేతృత్వంలో అసోం ప్రభుత్వం నిజాలు నిగ్గుతేలుస్తుంటే ప్రతిపక్షాలు అడ్డు పడకపోవటం మంచిది. బీజేపీ హిందూత్వ ఎజెండాపై అనుమానాలుంటే, పేద ముస్లిమ్ లు నష్టపోతారనుకుంటే సభలో చర్చించటం ఉత్తమం. అంతే కానీ, మమత బెనర్జీ లాంటి సీఎంలే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వివాదాన్ని ముదిరేలా చేస్తే ఏ ఉపయోగం వుండదు. జాతీయ భద్రతకే ముప్పుగా మారుతుంది. అందుకే దీనిపై అన్ని పక్షాల నేతలు సంయమనం పాటించాలి. పాటించని వార్ని జనం ఓ కంట గమనించి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలి…