అసోంలో వరద విలయం..12 మంది మృతి

గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అసోంలో వరదలు విలయం సృష్టిస్తున్నాయి. బ్రహ్మపుత్ర దాని ఉపనదులు ప్రమాదస్థాయిని మించి పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా ఇప్పటి వరకూ 12 మంది మరణించడంతో పాటు సుమారు 20 లక్షల మంది నిరాశ్రయులైనట్లు అసోం ప్రభుత్వం ప్రకటించింది. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించారు. వరద బీభత్సం కారణంగా అసోం అసెంబ్లీ సమావేశాలను ఆగస్టు 8 వరకూ వాయిదా వేశారు. ఎమ్మెల్యేలంతా వారి నియోజకవర్గాల్లో వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి సర్చానంద సోనోవాల్ ఆదేశించారు.