జనాభా గణన సహేతుకమేనా...!?

 

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చేస్తున్న విన్యాసాలు దేశ ప్రజలను, రాజకీయ పార్టీలనూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. జాతీయ పౌరుల రిజస్టర్ (ఎన్ఆర్‌సీ) పేరుతో ఆసోంలో జరుగుతున్న జన గణన విమర్శలకు దారి తీస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసమే భారతీయ జనాత పార్టీ ఈ గణన చేపట్టిందని సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ఆసోంలో చేపట్టిన ఈ జాతీయ పౌరుల రిజష్టర్‌లో ఏకంగా 40 లక్షల మంది ప్రజల జీవితాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దశాబ్దాల కాలంగా ఆసోంలో నివసిస్తున్న వారి స్థానికత ఇప్పుడు ప్రశ్నార్దకం అయ్యింది. వీరంతా పొరుగు దేశానికి చెందిన వారని, అక్కడి నుంచి దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అనుమానిస్తోంది. 

 

 


ఈ అనుమానలే జాతీయ పౌరుల రిజస్టర్ రూపకల్పనకు అంకురమైంది. ఆసోంలో జరుగుతున్న ఈ జాతీయ పౌరులరిజస్టర్ పై సర్వాత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది దేశంలో మైనార్టీలు, హిందువులు, బెంగాలీలు, బిహారీలకు సంబంధించిన సమస్యగా ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఆసోంలో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసిన 40 లక్షల మంది ప్రజానీకం ఇప్పుడు దేశంలో శరాణార్దులుగా మారారా అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల ముందు పనికి వచ్చిన వారు ఇప్పుడు హఠాత్తుగా పనికి రాకుండాపోయారా అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా ఆసోం పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరుగుతున్నారు. ఈ కొత్త జాతీయ పౌరుల రిజస్టర్ తో దేశంలో అంతర్‌యుద్ధం, రక్తపాతం జరుగుతుందని మమతా దీదీ హెచ్చరిస్తున్నారు. నిజానికి రాష్ట్రాలలో జనాభా గణన అనేది ఆయా రాష్ట్రాలు నిర్వాహించాలి. అది రాష్ట్రాలకు సంబంధించిన అంశం. కాని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ జనాభా గణనను తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. తెలంగాణలో బిసీ కులాల గణనను ఈ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టింది.

 

 

జాతీయ పౌరుల రిజస్టర్ అనే పేరుతో జనాభా గణనను జాతీయ స్థాయి పరిధిలోకి తీసుకు వచ్చి కేంద్రం కొత్త ఆచారాలకు తెర తీస్తోంది. ముఖ‌్యంగా సరిహద్దు రాష్ట్రాలపై తమ చూపును కేంద్రీకరిస్తునట్లు తెలుస్తోంది. భారత... బంగ్లాదేశ్‌ల సరిహద్దు రాష్ట్రమైన ఆసోంలో ఈ జనాభా గణన ప్రారంభించిన బిజేపి దీన్ని ఇతర రాష్ట్రాలకు వ్యాపింప చేసే అవకాశాలున్నాయి. అదే జరిగితే దేశంలో పలు సరిహద్దు రాష్ట్రాలలో ఈ జాతీయ పౌరుల రిజస్టర్ పేరుతో మరింత గందరగోళం తలెత్తే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది దేశానికి అంత మంచిది కాదు. ప్రజలను గణన పేరుతో విభజించడాన్ని ఎవరూ హర్షించరు.  దీనిపై భారతీయ జనతా పార్టీ నాయకులు పునరాలోచించాల్సిన అవసరం ఉంది. దీనిపై సమీక్షించాల్సిన అవసరమూ ఉంది. 

 

 

ఎన్నికలకు ఏడాది గడువున్న ఈ సమయంలో ఇలాంటి చిల్లరమల్లర పనులతో భారతీయ జనతా పార్టీ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నట్లుగా ఉంది. లేకపోతే ఇన్నాళ్లూ లేని ఈ కొత్త గణన ఇప్పుడెందుకొచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇద్దరూ తీసుకుంటున్న నిర్ణయాలలో 90 శాతం ప్రజలు తిరస్కరించినవే. అంతే కాదు... ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నవే. అందులో ప్రధానమైనవి నోట్ల రద్దు, జిఎస్టి. వీటి కారణంగా సామాన్యులు రోడ్డున పడ్డారు. చిన్న వ్యాపారులు దిక్కుతోచని వారయ్యారు. ఇప్పుడు మళ్లీ  ఈ జనాభా గణన పేరుతో కొత్త చిక్కులకు శ్రీకారం చుడితే అది భారతీయ జనతా పార్టీకి ఆత్మహత్యాసద్రశ్యమే అవుతుంది. దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్న ఇలాంటి నిర్ణయానికి ఆ నేతల ద్వయం స్వస్తి పలుకుతారో... లేక నియంత్రత్వ ధోరణితో ముందుకు వెళ్తారో చేడాలి...!?