ఏఎస్పీ భుజంగరావు అక్రమఆదాయం రూ. 5.92 కోట్ల పైనే.!
Published on: Tue Jul 7, 2026 2:51PM

తెలంగాణలో సస్పెన్షన్‌లో ఉన్న అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నాయిని భుజంగరావుపై ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆయన తన చట్టబద్ధమైన ఆదాయ వనరులకు మించి దాదాపు 5.5 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.
ఏసీబీ విచారణలో నాయిని భుజంగరావు పేరుతో పాటు కుటుంబ సభ్యుల పేర్లపై మొత్తం రూ.5.6 కోట్ల రూపాయల విలువైన చర, స్థిరాస్తులను కలిగి ఉన్నట్లు గుర్తించింది. దర్యాప్తులో సంబంధిత కాలంలో ఆయనకు వివిధ వనరుల ద్వారా సుమారు 1.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అదే కాలంలో 71.58 లక్షల రూపాయల మేర ఖర్చులు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ లెక్కల ప్రకారం ఆయన వద్ద చట్టబద్ధంగా ఉండాల్సింది 88.42 లక్షల రూపాయలు మాత్రమేనని ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
కానీ ఆయన వద్ద రూ.5.92 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సోదాలలో ఏసీబీ గుర్తించింది. చట్టబద్ధమైన పొదుపు కంటే ఆయన రూ.5. 04 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని పేర్కొంది. ఈ ఆస్తుల మూలాలపై సరైన వివరణ ఇవ్వడంలో నాయిని భుజంగరావు విఫలమైనట్లు ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.
ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసేందుకు తెలంగాణ ఏసీబీసెంట్రల్ జోన్ జాయింట్ డైరెక్టర్ అనుమతి జారీ చేశారు.
ప్రస్తుతం ఈ కేసులో ఆదాయ వనరులు, ఆస్తుల కొనుగోలు, పెట్టుబడులు, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలు, వాటి నిధుల మూలాలపై ఏసీబీ అధికారులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ACB, FIR, Telangana, Telugu News


