తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు ! క్లారిటీ ఇచ్చిన కేటీఆర్.. 

వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో ముందుందని ఐటీ మంత్రి, కొవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మెన్ కేటీఆర్ అన్నారు. జాతీయ సగటు కంటే తెలంగాణలోనే ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. అయితే వ్యాక్సినేషన్ ఉత్పత్తే ఇప్పుడు సవాల్‌గా మారిందని ఆయన అన్నారు.  రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కొరతకు డిమాండ్-సప్లై అంశమే కారణమని అభిప్రాయపడ్డారు. 70 శాతం ప్రజానీకం వ్యాక్సిన్ పొందితే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని తెలిపారు

2.9 కోట్ల వయోజనుల్లో 1.9 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం రెండు డోసుల వ్యాక్సిన్లు అమల్లో ఉన్నందున ఆ లెక్కన 3.8 కోట్ల డోసులు అవసరం అవుతాయని కేటీఆర్ వివరించారు.ఇప్పటివరకు రాష్ట్రంలో 10 లక్షల 30 వేల మందికి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్టు తెలిపారు, 

మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో (Ask KTR) ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు.ఆస్క్ కేటీఆర్ పేరిట జరిగిన ఈ సంభాషణ జాతీయస్థాయిలో ట్విట్టర్ ట్రెండింగ్లో నంబర్ వన్ గా నిలిచింది.ఈ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ... లాక్ డౌన్ పొడిగింపుపై క్యాబినెట్ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని, ఈ నెల 20న క్యాబినెట్ సమావేశం కానుందని వెల్లడించారు.

ఆక్సిజన్ సరఫరా మొత్తం కేంద్రం చేతుల్లోకి తీసుకుందని కేటీఆర్ అన్నారు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ దొరకడం అనేది సవాల్‌గా మారిందని వ్యాఖ్యానించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రెమిడెసివర్ వాడకంపై ఆడిట్ చేస్తున్నామని తెలిపారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు అవసరం లేకున్నా వాడుతున్నట్టు తేలిందని అన్నారు. ఈ విషయంలో పేషెంట్లకు డాక్టర్లు అన్యాయం చేయొద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. 

ఆక్సిజన్ సిలిండర్లు మరియు రెమ్ డెసివిర్ వంటి మందుల సరఫరాను ప్రభుత్వమే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అందజేయాలన్న సూచనకు స్పందించిన కేటీఆర్... ఆక్సిజన్ సరఫరా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందని, ఆక్సిజన్ సప్లై  విషయంలో దేశం సవాళ్లను ఎదుర్కొంటున్నదని అన్నారు. మరోవైపు రెమ్ డెసివిర్ మందుల వినియోగంలో ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తూ, పర్యవేక్షిస్తుందని, అయితే కోవిడ్ సోకిన రోగులకు కుటుంబాల నుంచి ఈ మందు వినియోగానికి తమ పైన తీవ్రమైన ఒత్తిడి ఉన్నదని వైద్య వర్గాలు తెలిపిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరోవైపు ఆక్సిజన్, రెమ్ డెసివిర్ మందుల ను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న అనేక మందిని ఇప్పటికే అరెస్టు చేసిన విషయాన్ని కేటీఆర్ తెలిపారు 

రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నియంత్రణ కోసం చేస్తున్న ప్రయత్నాలను కొంతమంది దుష్ప్రచారం, అసత్యాలతో బద్నాం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలతో అయోమయానికి గురి కావద్దని, ఇవన్నీ  రాజకీయ దురుద్దేశాలతో కూడినవే అని కేటీఆర్ అన్నారు ప్రస్తుతం ఉన్న కోవిడ్ సంక్షోభం మన రాష్ట్రంలో ఉన్న ఫార్మా ఇండస్ట్రీ జాతీయ ప్రాధాన్యతను తెలిపిందని అందరూ అనుకున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఫార్మాసిటీ ప్రాజెక్టు అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా మారబోతుంది అని కేటీఆర్ అన్నారు. కోవిడ్ సంక్షోభం ఉన్నంతకాలం తెలంగాణకి ఇతర దేశాల నుంచి విమానాలు రాకుండా అడ్డుకునే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే అన్నారు. అది రాష్ట్ర సబ్జెక్ట్ కాదని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేవలం తెలంగాణ వారికి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ నుంచి వస్తున్న రోగులకు సైతం చికిత్స అందిస్తుందని, ఈ అద్భుతమైన ప్రయత్నంలో భాగస్వాములుగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. 4 రాష్ట్రాలకు కేంద్రంగా రోగులకు చికిత్స అందిస్తున్న  హైదరాబాద్ నగరానికి కేంద్రం అందిస్తున్న ఆక్సిజన్ మరియు మందుల కోటాను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రస్తుతం ఉన్న సంక్షోభ కాలంలో కోవిడ్ నియంత్రణ కోసం పనిచేస్తున్న పౌరులు మరియు సంస్థల సేవలను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా కొనియాడారు. వారందరికీ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ప్రపంచం ఎప్పుడూ ఎదుర్కొని ఈ పరిస్థితుల్లో ఉన్నామని, ఇలాంటి సందర్భంలో కనీసం ఆన్లైన్ ద్వారానైనా చదువుకునే లేదా కోచింగ్ తీసుకునే విద్యార్థులు పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు.కోవిడ్ ద్వారా తమ తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక హెల్ప్ డెస్క్ ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు 

ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఎవరికైనా covid symptoms ఉంటే వెంటనే మల్టీ విటమిన్లు మరియు ఇతర ప్రాథమిక మందులను తీసుకోవడం ప్రారంభించాలని, టెస్ట్ రిజల్ట్ కోసం వేచి ఉండద్దన్నారు. మొదటి దశ covid సంక్షోభం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏమి నేర్చుకుందని ప్రశ్నిస్తున్న పలువురికి సమాధానంగా మంత్రి ఈ సందర్భంగా కొన్ని గణాంకాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ముఖ్యంగా సెప్టెంబర్ నాటికి ఆక్సిజన్ బెడ్లు రాష్ట్రంలో 92103 ఉంటే ప్రస్తుతం అవి 20,739 గా ఉన్న అంశాన్ని ప్రస్తావించారు. అయితే కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చే విషయంలో మాత్రం మంత్రి కేటీఆర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు.