TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేజ్రీవాల్ ఇల్లు మారిన గంటల్లోనే క్రేజీ ట్విస్ట్

Published on: Sat Apr 25, 2026 4:15PM

 

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ పక్షం నిలువునా చీలిపోయింది. పార్టీలో తిరుగుబాటు జెండా ఎగురవేస్తూ ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఒకేసారి బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆప్ రాజ్యసభ మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎంపీ రాఘవ్ చడ్డా నాయకత్వంలో విలీన పత్రాన్ని రాజ్యసభ చైర్మన్‌కు సమర్పించారు. ఆప్ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు చడ్డా ప్రకటించారు. ప్రస్తుతం రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి 10 మంది సభ్యులు ఉండగా, అందులో ఏడుగురు వలసబాట పట్టడం పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. 

రాఘవ్ చడ్డా, అశోక్ కుమార్ మిట్టల్, సందీప్ పాఠక్, హర్బజన్ సింగ్, రాజేంద్ర గుప్తా, స్వాతి మలివాల్, విక్రమ్ సింగ్ సాహ్ని బీజేపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు.ఇదిలా ఉంటే, రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి చడ్డాను అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే తొలగించారు. ఈ పరిణామం జరిగిన కొద్ది రోజులకే చడ్డా పార్టీ మారడం పెద్ద ట్విస్ట్‌గా మారింది. మరోవైపు, కేజ్రీవాల్ నియమించిన కొత్త డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అశోక్ మిట్టల్ కూడా చడ్డా వెంట వెళ్లడం ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బగా మారింది.

ఇక మరో ఆసక్తికర పరిణామం ఏమిటంటే—ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్‌పై విడుదలైన తర్వాత కేజ్రీవాల్ ముఖ్యమంత్రి నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో అశోక్ మిట్టల్ ఆయనను తన అధికారిక నివాసానికి ఆహ్వానించారు. మండీ హౌస్ సమీపంలోని 5 ఫిరోజ్‌షా రోడ్ బంగ్లాలో కేజ్రీవాల్ తన కుటుంబంతో కలిసి కొంతకాలం నివసించారు. అనంతరం, జాతీయ పార్టీ అధినేత హోదాలో లోధీ ఎస్టేట్‌లోని బంగ్లాను ప్రభుత్వం ఏప్రిల్ 24న కేజ్రీవాల్‌కు కేటాయించగా, ఆయన అక్కడికి మారారు.అయితే, కేజ్రీవాల్ ఆ నివాసం నుంచి వెళ్లిపోయిన కొన్ని గంటలకే అశోక్ మిట్టల్ ఆప్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఇది కేజ్రీవాల్‌కు ఊహించని షాక్‌గా భావిస్తున్నారు.