నిజంగానే మరిచిపోయారా.. కావాలని చేశారా..!

 

ఎయిరిండియా సిబ్బంది వల్ల గతంలో ఎంతోమంది ప్రయాణికులు ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే. అలాంటిది ఇప్పుడు ఏకంగా భారత విమానయానశాఖ మంత్రిగా పని చేసిన అశోక్ గజపతిరాజుకే ఎయిరిండియా వల్ల చేదు అనుభవం ఎదురైంది. వివరాల ప్రకారం... అశోక్ గజపతిరాజు తన భార్య కూతురు, సోదరితో కలిసి ఢిల్లీ నుంచి విశాఖపట్టణం వచ్చేందుకు ఎయిర్ ఇండియా విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లైట్ ఎక్కేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ రాజుగారి లగేజీని తనిఖీ చేశారు విమానాశ్రయ సిబ్బంది. ఇక  అశోక్ గజపతి రాజు ఫ్లైట్ ఎక్కి విశాఖ చేరుకున్నారు. ఆతరువాత... ఆయన తన లగేజీ కోసం చూసుకుంటే అది ఎక్కడా కనపడలేదు, ఎంతకీ ఆయన లగేజీ రాలేదు. ఆ విమానంలో ప్రయాణించిన అందరి లగేజీ వచ్చినా తన లగేజీ మాత్రం రాకపోవడంతో అశోక్ గజపతి రాజు ఆశ్చర్యపోయారట. విషయం ఏమిటంటే, ఆయనను లోనికి అనుమతించిన తరువాత ఆయన బుక్ చేసిన లగేజీని తనిఖీ చేసి అక్కడే వదిలేశారు. దీంతో పరిస్థితి గమనించిన సిబ్బంది... ఆయనకు క్షమాపణలు చెప్పి...లగేజీని జాగ్రత్తగా చేరుస్తామని హామీ ఇచ్చింది.


దీంతో ఇప్పుడు ఎయిరిండియా చేసిన నిర్వాకంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మాజీ విమానయాన శాఖ మంత్రికే ఇలా జరిగితే... సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు...ఇది కాకతాళీయంగా జరిగిందా లేక కావాలని అశోక్ గజపతిని అవమానించాలని ఇలా చేశారా అన్నఅనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏపీ కి ప్రత్యేక హోదా విషయంలో ఎన్డీయే నుండి తెలుగుదేశం బయటకి వచ్చేసిన సమయంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ ఆందోళన ముగిసి ఆంధ్రాకి బయలుదేరే ముందే ఈ ఘటన జరగడంతో అనేక అనుమానాలకి తావిస్తోంది. ఎందుకంటే నెల రోజుల క్రితందాకా ఆయన క్యాబినెట్ మంత్రి, ఇప్పుడు మంత్రి కాకపోయినా ఎంపీ క్యాబినెట్ మంత్రి గా పని చేసిన వీఐపీ కి చెందిన వస్తువులని సాధారణంగా అయితే ఇలా నిర్లక్ష్యంగా వదిలివేయరు ఎయిర్ ఇండియా స్టాఫ్. అది కూడా ఆయన మంత్రిగా పని చేసిన విమానయాన శాఖకి చెందిన ఎయిర్ ఇండియా సిబ్బంది ఇలా వ్యవహరించే అవాకాశం ఉండదు సో ఇదంతా కావాలనే చేయించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.