ఓవైసీగారి.. ఓవర్ యాక్షన్!

 

మోకాలికి , బోడి గుండుకి లంకె పెట్టడం ఎవరి నుంచి నేర్చుకోవాలి? మన రాజకీయ నాయకుల దగ్గర నుంచి! మరీ ముఖ్యంగా, హైద్రాబాద్ మోధుడు అసదుద్దీన్ ఓవైసీ నుంచీ! ఫారిన్ వెళ్లి లా చదువుకుని వచ్చిన ఈ బారిష్టరుగారు ఎప్పుడూ లౌకికవాదమే మాట్లాడుతుంటారు. అందుకు తగ్గట్టే బీజేపి నేతల్ని మతతత్వవాదులని తెగ తిట్టిపోసే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇతర ప్రాంతీయ పార్టీల వారు కూడా ఈ ఆలిండియా ముస్లిమ్ నేతని మాత్రం సెక్యులర్ గానే లెక్కేసుకుంటారు! పల్లెత్తు మాటనరు! అందుకే, ఈయన అప్పుడప్పుడూ కాంట్రవర్సియల్ స్టేట్మెంట్లు చేస్తూ అందర్నీ అలరిస్తుంటారు. తాజాగా అలాంటిదే ఓ ట్వీట్ చేశారు అసద్ భాయ్...

 

తన తమ్ముడు, మహా శాంత మూర్తి, అక్బరుద్దీన్ ఆ మధ్య దారుణమైన కామెంట్స్ చేశాడు. దానిపై ఇంత వరకూ ఖండన లేదు గౌరవ ఎంపీ అసదుద్దీన్ వద్ద నుంచి. పదిహేను నిమిషాలు పోలీసులు పక్కకి జరిగితే హిందువులకి తమ తడాఖా చూపిస్తామని ముస్లిమ్ యూత్ ని అక్బర్ మహాశయుడు రెచ్చగొట్టాడు. అందుకు జైలుకి కూడా వెళ్లాడు. అయినా అది కోర్టులో కొనసాగుతున్న వ్యవహారం కాబట్టి తాను ఏం మాట్లాడనని తప్పించుకుంటాడు అన్న అసదుద్దీన్ ఓవైసీ. తమ్ముడి తప్పు ఖండించటానికి కూడా నాలుక రాని ఈయన కోర్టుని అడ్డు పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నాడు కాని... అదే కోర్టు రేపు యూనిఫామ్ సివిల్ కోడ్ పై ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఒప్పుకుంటే సీన్ లేదన్నట్టు మాట్లాడుతున్నాడు!సుప్రీమ్ కోర్టులో యూనిఫామ్ సివిల్ కోడ్ పై విచారణ జరుగుతోంది.

 

కొన్ని ప్రశ్నలకి జవాబులు ఇవ్వాలని వివిధ పక్షాల్ని, ప్రభుత్వాన్ని కోరింది కోర్టు. అందుకు ఆలిండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డ్ అంగీకరించలేదు. కోర్టు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వమని తేల్చేసింది. తమకు ప్రత్యేక పర్సనల్ లా బోర్డ్ వుండాల్సిందేనని పట్టుబడుతోంది. చట్టం ముందు అందరూ సమానమే అని ముస్లిమ్ పెద్దలు అంగీకరించటం లేదు. ఇక ఓవైసీగారిది కూడా అదేమాట. కాకపోతే, తన పార్టీ ఎంఐఎం తరుఫున మాత్రం కోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాడట. కాని, అదే కోర్టు యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలని ఆదేశిస్తే మాత్రం ఏమవుతుందో తెలుసా? తన ట్విట్టర్ అకౌంట్లో సెలవిచ్చారు ఓవైసీ! జల్లికట్టు విషయంలో జనం ఎలా స్పందించారో అలాగే అవుతుందట! అయితే, తన ట్వీట్లో మనోడు కోర్టును కాకుండా తెలివిగా హిందూత్వవాదుల్ని టార్గెట్ చేశాడు. జల్లికట్టు నిరసనలు హిందూత్వవాదులకి హెచ్చరికనట! యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తే కూడా అంతే అన్నట్టు వారెంట్ ఇచ్చాడు!

 

తమ్ముడు అక్బరుద్దీన్ వ్యాఖ్యల విషయంలో కోర్టులో కేసు నడుస్తోందని చెప్పే అసదుద్దీన్ అదే కోర్టు యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయమంటే మాత్రం ఒప్పుకోననటం మన నేతల తెలివితేటలకి నిదర్శనం. తమకు అనుకూలమైన అంశాల్లో కోర్టు, వ్యతిరేక అంశాల్లో జనం సెంటిమెంటు... ఇదీ వరస!