పవన్ కళ్యాణ్ కి మజ్లిస్ వార్నింగ్

 

మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మళ్ళీ చాలా కాలం తరువాత వార్తలలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ మతతత్వ బీజేపీకి, నరేంద్ర మోడీకి మద్దతు తెలపడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. నరేంద్ర మోడీ, బీజేపీల గురించి తెలిసి ఉన్నపటికీ పవన్ కళ్యాణ్ పనిగట్టుకొని గుజరాత్ వెళ్లి మోడీని కలవడం, బీజేపీకి మద్దతు తెలపడాన్ని అసదుద్దీన్ ఖండించారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ మోడీకి, బీజేపీకే మద్దతు ఇచ్చేందుకు సిద్దపడినట్లయితే, హైదరాబాదులో అతని సినిమాలను ఆడనీయమని హెచ్చరించారు. అదేవిధంగా మీడియా కూడా నరేంద్ర మోడీ జపం చేయడాన్ని ఆయన నిరసించారు. అటువంటి మతతత్వవాదికి మీడియా కూడా మద్దతు ఈయడం మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

 

అసదుద్దీన్ ప్రాతినిధ్యం వహిస్తున్న మజ్లీస్ పార్టీ కూడా పూర్తిగా మత ప్రాతిపాదికనే, ముస్లిం ఓటు బ్యాంకుని లక్ష్యంగా చేసుకొని ఏర్పడినదే. అటువంటప్పుడు ఆయన బీజేపీని మతతత్వ పార్టీ అని ఎద్దేవా చేయడం హాస్యాస్పదం. అదేవిధంగా కేవలం హైదరాబాద్ కే పరిమితమయి కనీసం ఉప ప్రాంతీయ పార్టీ అని కూడా చెప్పుకోలేని మజ్లిస్ పార్టీకి నేతృత్వం వహిస్తున్న అసదుద్దీన్ జాతీయ పార్టీ అయిన బీజేపీని, ప్రాంతీయ పార్టీ అయిన జనసేనను విమర్శించడం దేనికంటే కేవలం తాను మాత్రమే బీజేపీని దానిని సమర్ధించే పార్టీలను దైర్యంగా డ్డీ కొట్టి, ముస్లిముల తరపున పోరాడగలనని చెప్పుకొని ముస్లిం ప్రజల ఓట్లు పొందడానికే. మతతత్వ బీజేపీని, దాని ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీని బూచిగా ఎత్తిచూపుతూ ముస్లిం ప్రజలలో అభద్రతా భావం కలిగించడం ద్వారా వారి ఓట్లు రాల్చుకోవాలని అసదుద్దీన్ ఆలోచన. కానీ, రాజకీయంగా మంచి చైతన్యవంతులయిన ముస్లిం ప్రజలను ఇటువంటి మాటలతో బయపెట్టి ఓట్లు రాబట్టుకోవాలని అసదుద్దీన్ ప్రయత్నించడం చాలా హాస్యాస్పదం.

 

ప్రజల నుండి ఓట్లు రాబట్టుకొనేందుకు కేసీఆర్ తెలంగాణా సెంటిమెంట్, కిరణ్ సమైక్య సెంటిమెంటు, జగన్ తండ్రి సెంటిమెంటు వాడుకొంటునట్లే అసదుద్దీన్ ముస్లిం సెంటిమెంట్ వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రయాపడుతున్నారు.