కుల్జా...సిం...సిం...

 

 

కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్నంత కాలం, కలెక్టరుపైనా చేయిచేసుకొన్నా, పోలీసులను బెదిరించినా తమని దేశంలో ఏకోర్టులూ ఏమి చేయలేవని మిడిసిపడిన ఓవైసీ సోదర ద్వయం, వాపును బలుపనుకొని తమ అండతోనే కాంగ్రెస్ బ్రతుకుతోందని భావిస్తూ ఆ పార్టీకి తలాకులిచ్చేసి బయటకొచ్చి తమ పార్టీని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రత్యమ్నాయంగా రాష్ట్రం మొత్తం విస్తరించుదామని భారీ ప్రణాళిక ప్రకటించారు.

 

అయితే, వారింతవరకు పయనించిన దారి సరి కాదు, ఇప్పుడు పయనించడానికి ఎంచుకొన్న దారీ కూడా సరికాదని కోర్టులు నిరూపించాయి.

 

ఇక అసలు కధలోకి వస్తే, ఓవైసీ సోదర ద్వయంపై 2005వ సం.లో మెదక్ జిల్లా కలెక్టర్ పై చేయిచేసుకొన్న కేసులో పోలీసులు కేసు నమోదు చేయడం, అప్పటి నుండి ఇప్పటివరకు కోర్టు 15 నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే, అధికార ‘హస్తం’ పట్టుకొని తిరుగుతున్న ఆ సోదర ద్వయాన్ని చివరికి నాన్ బెయిలబుల్ వారంటులు కూడా ఏమి చేయలేకపోయాయి. చట్టాలు, న్యాయస్థానాలు అంటే తమకి గౌరవం అని చెప్పే ఓవైసీ సోదర ద్వయం వాటిని ఇంతవరకు కూడా అపహాస్యం చేస్తూనే ఉన్నారు.

 

అయితే, వినాశకాలే విపరీత బుద్ధీ అన్న సామెతను నిజం చేస్తూ, కాంగ్రెసును దిక్కరించి బయటకి రావడం, మళ్ళీ దానితోనే గొడవపడటంతో వారి పాత కేసులన్నీ ఒకటొకటిగా పోలీసులు బయటకి తీసి వారిపై చర్యలకు సిద్దం అవుతున్నారు. మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీని కూడా మిలాద్-ఉన్-నభీ పండుగ తరువాత అరెస్ట్ చేయడానికి యోచిస్తున్నట్లు తెలుసుకొన్నఆయన అతితెలివి ప్రదర్శిస్తూ, తానే స్వయంగా సంగారెడ్డి కోర్టుకు వెళ్లి నిన్నలొంగిపోయారు. అది కోర్టు మీద గౌరవం అనుకొంటే పొరబాటే. పండుగ ముందు ఆయనని అరెస్ట్ చేస్తే ముస్లిం ప్రజలు భావోద్వేగాలకు లోనయి శాంతి భద్రతల సమస్య తల్లెత్తవచ్చునని పోలీసులు ఆలోచించి ఆగితే, 8 సం.లుగా కోర్టు మొహం చూడని అయన పండుగ సమయంలో పోలీసులు తనను అన్యాయంగా జైల్లో పెట్టేరని తన వర్గం ప్రజల నుండి సానుభూతి పొంది పార్టీని వారికి మరింత చేరువగా తీసుకుపోవాలనే దురాలోచనతో కోర్టుకు లొంగిపోయినట్లు కనిపిస్తోంది. రెండు రోజులు జైల్లో ఉంది బెయిలు తీసుకొని బయటకి వచ్చేస్తే తన తలరాతలు మార్చేసుకోవచ్చుననే ఆలోచనతో బోనులోకి ప్రవేశించిన అయన చివరికి అదే బోనులో ఇరుక్కుపోయారు.

 

కోర్టు ఆయనని తీవ్రంగా తప్పుబట్టడమే గాకుండా అయన బెయిలు దరఖాస్తును త్రోసిపుచ్చి వచ్చే నెల 2వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విదిస్తూ జైలుకు పంపింది. ఆలీబాబా కధలో దురాశకు పోయిన ఆలీబాబా తమ్ముడు ‘కుల్జా...సిం...సిం’ అంటూ మంత్రం చదవి ధనరాసులు పోగేసున్న గుహలోకి ప్రవేశించి అంతా మూటకట్టుకోన్నాక, ఆ మంత్రం మరిచిపోవడంతో తిరిగి బయటకి వెళ్ళలేక గుహలోనే చిక్కుకుపోయిన్నట్లే, మన గౌరవనీయులయిన మజ్లిస్ శాసన సభ్యులు అసదుద్దీన్ గారు కూడా అతితెలివి ప్రదర్శించి జైల్లో ఇర్రుకుపోయారిప్పుడు.