పహిల్వాన్ తో కుస్తీకే మొగ్గు చూపుతున్న అసదుద్దీన్

 

హైదరాబాద్ పాతబస్తీ అనగానే మజ్లిస్ పార్టీ దాని అధినేతలు ఒవైసీ సోదరులే ముందు గుర్తుకు వస్తారు. వారిలో చిన్నవాడయిన అక్బరుదీన్ ఒవైసీపై దాదాపు రెండేళ్ళ క్రితం అదే ప్రాంతానికి చెందిన మొహమ్మద్ పహిల్వాన్ హత్యా ప్రయత్నం చేసినపుడు, ఒవైసీ త్రుటిలో తప్పించుకోగలిగాడు. అప్పుడు పహిల్వాన్ పై ఆయన నమోదు చేసిన కేసు నేటికీ కోర్టులో నలుగుతూనే ఉంది. అయితే మొన్నఅకస్మాత్తుగా పహిల్వాన్ శ్రేయోభిలాషులుగా చెప్పబడుతున్నఓనలబై,యాబై మంది బర్కాస్, జామియా మశీదు యొక్క ఇమామ్ నేతృత్వంలో, దరుసలాం వద్దగల ఒవైసీల కార్యాలయానికి వచ్చి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీతో దాదాపు అర్ధగంట పైగా మంతనాలు చేసారు.

 

పహిల్వాన్ తరపున వచ్చిన వారు దయచేసి ఆయనను క్షమించి, ఈ కేసును ఇంతటితో ముగించాలని అసదుద్దీన్ ఒవైసీకి విజ్ఞప్తి చేసారు. అయితే ఆయన తన సోదరుడిపై హత్యా ప్రయత్నం చేసిన మహమ్మద్ పహిల్వాన్ ను ఎట్టి పరిస్థితుల్లో క్షమించే ప్రసక్తే లేదని, అతనితో రాజీకి అంగీకరించబోమని, ఈ విషయం ఇక కోర్టులోనే తేల్చుకొందామని వారికి చెప్పడంతో వారు అసంతృప్తిగా వెనుతిరిగారు.

 

ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో కేవలం పాతబస్తీకే పరిమితమయిన మజ్లిస్ పార్టీ నేతలు, తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు స్థానికంగా బలమయిన యఫై శాఖకు చెందిన పహిల్వాన్ తో రాజీపడి ఆయన వర్గానికి చెందిన ముస్లిం ప్రజల ఓట్లను పొందుతారో లేక తమపై హత్యాప్రయత్నం చేసిన వ్యక్తికి శిక్ష పడేందుకే మొగ్గు చూపుతారో త్వరలోనే తేలిపోవచ్చును.