‘భూమి వున్నంతవరకు అత్యాచారాలు వుంటాయి’

 

ఈమధ్య కాలంలో రాజకీయ నాయకులకు నోటి దురద ఎక్కువైపోయింది. అత్యాచార సంఘటనలకు సంబంధించి సానుభూతిని వ్యక్తం చేయాల్సింది పోయి నోటికొచ్చినట్టు మాట్లాడ్డం అలవాటైపోయింది. మొన్నటి వరకూ ఉత్తరప్రదేశ్‌లోని ఎస్పీ నాయకులు అత్యాచారాల విషయంలో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ, తమ నోటి దురద తీర్చుకునేవారు. ఇప్పుడా బాధ్యతని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు తీసుకున్నట్టున్నారు. అది కూడా ఒక మహిళా నాయకురాలు మమతా బెనర్జీ నేతృత్వం వహించే పార్టీ నాయకులు కూడా ఇలాగే మాట్లాడ్డం విషాదకరం. కోల్‌కతాలోని డైమండ్ హార్బర్ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా వున్న దీపక్ హల్దర్ ఒక బహిరంగ సభలో అత్యాచారాల విషయంలో దారుణమైన కామెంట్లు చేశారు. ’అత్యాచారాలు ఇంతకు ముందు ఉన్నాయి, ఈరోజు ఉన్నాయి.. ఇంకా చెప్పాలంటే భూమి ఉన్నన్నాళ్లు ఉంటాయి’ అన్నారు. ఆ తర్వాత నాలుక్కరుచుకున్న ఆయన ఈ కామెంట్ చేయడం వెనుక తన ఉద్దేశం ప్రజల్లో అవగాహన కల్పించాలనే తప్ప వేరేది కాదంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. హల్దర్ వ్యాఖ్యలపై మాత్రం విపరీతమైన దుమారం రేగింది. ఇంతకుముందు కూడా అత్యాచారాలపై తృణమూల్ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ’సీపీఎం వాళ్లు మా కార్యకర్తల జోలికి వస్తే, వాళ్ళ ఇళ్లలో స్త్రీలను రేప్ చేయాలని మావాళ్లకు చెబుతాను’ అని ఎంపీ తపస్ పాల్ ఇంతకుముందు అన్నారు.