ప్రజలే పావులుగా రాజకీయ రాక్షస క్రీడ !

 

 

 .....సాయి లక్ష్మీ మద్దాల

 

 

ఆంధ్ర -తెలంగాణా రాష్ట్ర విభజన అంశం గత కొద్ది రోజులుగా యావత్భారతవనిని సందిగ్ధ స్థితిలోకి నెట్టింది. జూలై 30 న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రకటన చేసింది మొదలు సీమాంధ్ర ప్రాంతంలో రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచాలంటూ ఉవ్వెత్తున ఉద్యమం లేచింది. 60రోజులుగా పిల్ల,పెద్ద అనే వయో భేదం లేకుండా యావత్ సీమాంధ్ర ప్రజానీకం రోడ్ల మీదే ఉంటూ ఉద్యమం చేస్తున్నారు. 2నెలలుగా ఉద్యోగస్తులకు జీతాలు లేవు. బడుగు,బలహీన ప్రజలకు తిండి,తిప్పలు లేవు. ఈ విధంగా ఇంత కఠిన తరంగా అక్కడి ప్రజలు తమ పిల్లల చదువుల కోసం,ఉద్యోగాల కోసం,అక్కడి ప్రజల భవిష్యత్తుకోసం తమ జీవితాలను ఫణంగా పెట్టి ఉద్యమం చేపడితే,ఆ ఉద్యమం తీవ్రతను ఇసుమంతైనా గమనించకుండా,గుర్తించ కుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అత్యంత రాక్షసంగా తెలంగాణపై ఏక పక్ష నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ప్రకటన ద్వారా సీమాంధ్ర ప్రాతం ఎంత నష్ట పోతుందో,ఆ నష్టాన్ని ఎలా నివారించ గలరో ఏవిధమైన భరోసాను,వివరణను ఇవ్వలేదు. మరి సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆందోళనలకు విలువ లేనట్లేనా?ప్రజల ఆందోళనలకు విలువ లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్ధం ఏముంది?ఒక 15 ఎంపి సీట్లకోసం ఇంతగా దిగజారిపోయిన ఈ కాంగ్రెస్ పార్టీనా ఆంధ్రరాష్ట్రం రెండుసార్లు వరుసగా గెలిపించింది అని ప్రతి తెలుగువాడు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి.


అక్టోబర్ 3 2013 న ఆంధ్ర రాష్ట్ర విభజన నిమిత్తమై దొంగచాటుగా విభజన నోట్ పెట్టి కేంద్ర ప్రభుత్వంచే సోనియా గాంధి ఆమోదింప చేసుకుంది.కాని ఇప్పటివరకు జరిగిన మూడురాష్ట్రాల విభజనల ప్రక్రియను పరిశీలిస్తే కేంద్ర కాబినెట్ లో ఆమోదం పొందిన నోట్ శాసనసభకు తీర్మానం నిమిత్తం వెళ్ళి,అక్కడ శాసనసభ ఆమోదం కూడా పొందినతరువాత కేంద్ర మంత్రుల బృందం ఇ దే నోట్ మీద బిల్లును తాయారు చేసి రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి ఆ బిల్లును తిరిగి మరల శాసనసభకు పంపించటం జరుగుతుంది. శాసనసభలో ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి పార్లమెంట్ కు ఆమోదం నిమిత్తం ఆ బిల్లును పంపిస్తారు. పార్లమెంట్లో ఒకసారి ఆమోదం పొందిన వెనువెంటనే దానిని రాష్ట్రపతి ఆమోదిస్తారు. ఇది ఇప్పటివరకు ఏర్పాటైన కొత్త రాష్ట్రాల విషయంలో జరిగిన రాజ్యాంగ ప్రక్రియ. కాని నేడు ఆంధ్రరాష్ట్ర విభజన విషయంలో మాత్రం దీనికి విరుద్ధంగా నోటు ను శాసనసభలో ప్రవేశపెట్ట కుండ నేరుగా బిల్లును తయారు చేస్తున్నారు. ఇది సమైఖ్య రాష్ట్ర స్ఫూర్తి కి విరుద్ధం.



                          
నోట్ ను బిల్లుగా తయారు చేయవలసిన మంత్రుల బృందానికి నిర్ణీత గడువు హొమ్ మంత్రిత్వ శాఖ షెడ్యుల్ లో 90 రోజులు అని ఉంది. కాని ప్రస్తుతం ఈ గడువును ఆరువారాలు అనగా సగానికి కుదించారు. నవంబర్ లో రానున్నపార్లమెంట్  శీతాకాల సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదింప చేసుకోవటానికి ఇంత హడావుడి ప్రక్రియ చేపట్టారు. వై.ఎస్.ఆర్.సి.పి  వారి రాజీనామాలతో శాసనసభలో నోట్ ను నేగ్గించుకోవాలని చూశారు. అది విఫలం కావటంతో నోట్ పై శాసనసభ ఆమోదం లేకుండానే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ కుటిల రాజకీయాలను తిప్పి కొట్టటానికి రాష్ట్రపతి మరియు న్యాయ వ్యవస్థలు తమ విచక్షణాధికారాన్ని ఉపయోగించాల్సి ఉంది.



                      
భారతదేశంలో ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ చాలా రాష్ట్రాలు ఉద్యమం చేస్తున్నాయి. గూర్ఖాలాండ్ 1907 నుండి ఉద్యమం చేస్తోంది. విదర్భ,ఉత్తర ప్రదేశ్ లు అసెంబ్లీ తీర్మానం కూడా పొందాయి. మరి కుప్పలుతెప్పలుగా ఉన్న మిగతా రాష్ట్రాల విభజన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇంత హడావుడిగా ఒక్క ఆంద్ర రాష్ట్రాన్ని అందున ఒకే జాతిని రెండుగా చీల్చే పాపానికి కాంగ్రెస్ అధిష్టానం ఒడిగట్టింది. కేవలం ఓట్లు సీట్లతో రాహుల్ ను ప్రధానిని చేయటమే లక్ష్యంగా సోనియా గాంధి, ఆమెకు తొత్తులుగా మారిన బొత్స సత్యనారాయణ లాంటి కొంత మంది సీమాంద్ర ద్రోహులు కలిసి ఆడుతున్న వికృత క్రీడ. ఏ విధమైన భరోసా లేకుండా పూర్తి అన్యాయ భరితంగా చేపట్టిన ఈ ప్రక్రియ మీద సీమాంధ్ర నేతలు ఇప్పటికైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించి తగు రీతిలో ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడాలి. అన్నిటికి మించి రాష్ట్రపతి చేతులలో అవకాశం ఇంకా మిగిలే ఉంది. నేరచరితులైన నేతల కోసం చేసిన ఆర్డినెన్సు ను ఎలా చెత్త బుట్ట దాఖలు తానుగా చేయ గలిగారో,చాలా అన్యాయంగా ఏక పక్షంగా కేబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా తన అధికారంతో వెనక్కు తిప్పి పంపించాల్సి ఉంది. లేని పక్షంలో 1907 నుండి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న గూర్ఖాలాండ్ ను కూడా పశ్చిమ బెంగాల్ నుండి ,పశ్చిమబెంగాల్ పౌరుడైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విడగొట్టాలి. అలా చేయలేకపోతే ప్రాంతీయ వ్యత్యాసాలు చూపిస్తున్న కారణంగా ప్రధమ పౌరిడిగా ఆ పదవిలో కొనసాగే అర్హత నైతికంగా ఆయనకు లేనట్లే.


 
                     
రాజకీయ స్వార్దాలకోసం తీసుకునే నిర్ణయాలు పార్టీలకు లాభం చేకూరుస్తాయేమో గాని జాతికి మాత్రం నష్టం తెస్తాయి. కొన్ని సందర్భాలలో ఆశించిన రాజకీయ ప్రయోజనం లభించకపోగా పూర్తి వ్యతిరేక ఫలితం కూడా అనుభవంలోకి రావచ్చు. ఇప్పటికైనా ఈ నేతలందరూ తమ పార్టీల జెండాలను,అజెండాలను పక్కనపెట్టి ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడితే కొంత వరకైనా న్యాయం జరగవచ్చు.