సాటి మనిషిని గుర్తించండి

 

సమాజంలో తనకంటూ ఓ గొప్ప స్థానం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. స్థానం సంగతి అలా ఉంచితే... కనీసం తను ఒకడు ఉన్నాడని అవతలివారు గుర్తించాలని అనుకుంటారు. ఈ గుర్తింపు కూడా పొందలేకపోతే మనిషి ఏమైపోతాడు? అలాంటివారితో ఎలా ప్రవర్తించాలి? అన్న అనుమానాలు వచ్చాయి పరిశోధకులకి. ఫలితంగా ఓ ప్రయోగం చేసి చూశారు. ఆ ప్రయోగం ఏమిటో! అది నేర్పే పాఠాలేమిటో చూడండి!

 

ఈ పరిశోధన కోసం సైకాలజిస్టులు, అభ్యర్థులతో ఒక ఆటని ఆడించారు. ఇందులో ఒకరికి ఒకరు బంతిని అందిస్తూ ఉండాలి. ఈ ఆటలో కొందరికి బంతి అస్సలు అందలేదు. ఇలాంటి సందర్భాలలో కావాలని తమని విస్మరిస్తున్నారన్న భావన మనకి కలగడం సహజం. ఇది ఆత్మన్యూనత, అభద్రతాభావం లాంటి తీవ్రమైన మనస్తత్వానికి దారితీస్తుందని తేల్చారు.

 

తన ఉనికిని గుర్తించకపోవడం వల్ల మనిషి అహం దెబ్బతింటుదనీ... అది తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుందనీ తేలిపోయింది. కానీ ఇలాంటి సందర్భాలను నివారించడం ఎలా అన్న దిశగా కూడా ప్రయత్నం చేశారు. తనని తిట్టినా, తిరస్కరించినా కూడా మనిషికి ఎలాగొలా తనని గుర్తించారులే అన్న తృప్తి కలుగుతుందట. ఏదో సినిమాలో చెప్పినట్లు- ‘కుదిరితే క్షమించు, లేదా శిక్షించు, కానీ మేం ఉన్నామని గుర్తించు’ అంటూ మనిషి తపించిపోతాడట.

 

మన చుట్టూ ఉండే ప్రతిఒక్కరి అహంకారాన్నీ మనం తృప్తి పరచలేకపోవచ్చు. కానీ వాళ్లూ మన రోజువారీ జీవితంలో భాగమేనని గుర్తించడం చాలా అవసరం అంటున్నారు. ఉద్యోగ సంస్థలు కూడా ఈ విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు. ఉద్యోగులని పరామర్శ ద్వారానో, విమర్శ ద్వారానో... అసలంటూ వారు తమ సంస్థలో ఉన్నారన్న విషయాన్ని గుర్తించాలంటున్నారు. అలాగే ఒకే ఉద్యోగానికి పదులకొద్దీ దరఖాస్తులు వచ్చినప్పుడు కూడా ఈ సూత్రాన్ని పాటించాలని చెబుతున్నారు. తిరస్కరించిన అభ్యర్థుల విషయంలో మిన్నకుండి పోకుండా మెయిల్‌ లేదా ఉత్తరం ద్వారా ‘మిమ్మల్ని తిరస్కరిస్తున్నాం’ అని తెలియచేయమంటున్నారు.

 

- నిర్జర.