TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రోశ‌య్య‌కు స‌భ‌లో సంతాపం తెల‌ప‌రా?.. జ‌గ‌న‌న్న‌పై ఆర్య‌వైశ్యుల క‌న్నెర్ర‌!

Published on: Tue Mar 8, 2022 1:45PM

ఏంటిది? మ‌రీ, ఇంత‌లా రివేంజ్ ఏంటి? చావుతోనూ రాజ‌కీయ‌మా? పాపం.. ఆ పెద్దాయ‌న చేసిన పాపం ఏంటి? ముఖ్య‌మంత్రిగా చేయ‌డ‌మే ఆయ‌న నేర‌మా? ద‌శాబ్దాల పాటు తెలుగు జాతికి సేవ చేయ‌డ‌మే త‌ప్పా? ఆర్య‌వైశ్యుడిగా పుట్ట‌డ‌మే శాప‌మా? రెడ్డి కాక‌పోవ‌డం వ‌ల్లే రాద్దాంత‌మా? రోశ‌య్య చ‌నిపోతే వెళ్ల‌లేదు.. క‌నీసం చివ‌రిసారి ఆయ‌న ముఖం కూడా చూడ‌లేదు? ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో క‌నీసం రోశ‌య్య మృతికి సంతాపం కూడా తెల‌ప‌లేదు. అదే.. నిన్న‌గాక మొన్న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి మర‌ణానికి ఇచ్చినంత ప్రాధాన్యం కూడా.. మాజీ సీఎం రోశ‌య్య‌కు ఇవ్వ‌రా? అని ప్ర‌శ్నిస్తున్నారు ఆర్య‌వైశ్యులు. 

మేకపాటి గౌతంరెడ్డి మృతికి స‌భ తీవ్ర సంతాపం తెలిపింది. ఏపీ అసెంబ్లీ ఒక‌రోజు వాయిదా ప‌డింది. గౌత‌మ్‌రెడ్డి మ‌ర‌ణం ప‌ట్ల అంతా విచారం వ్య‌క్తం చేశారు. అసెంబ్లీలో సంతాపం తెలిపి.. త‌మ బాధ‌ను పంచుకున్నారు. మ‌రి, ఇటీవ‌ల మ‌ర‌ణించిన రాజ‌కీయ కుర‌వృద్ధుడు రోశ‌య్య‌కు కూడా అదే స‌భ‌లో, అదే స‌మ‌యంలో సంతాపం తెలిపి ఉంటే బాగుండేద‌ని అంటున్నారు. గౌతంరెడ్డిలా ఆయ‌న ప్ర‌స్తుతం స‌భ‌లో స‌భ్యుడు కాక‌పోయినా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో రోశ‌య్యది చెర‌గ‌ని ముద్ర. చెర‌ప‌లేని సంత‌కం. 

ద‌శాబ్దాల పాటు మంత్రిగా చేశారు. అనేక‌సార్లు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. ముఖ్య‌మంత్రిగా ఏలారు. గ‌వ‌ర్న‌ర్‌గా రాణించారు. ఏపీలో రోశ‌య్య స్థాయి రాజ‌కీయ నేతలు అత్యంత అరుదు. అలాంటి రోశ‌య్య‌కు స‌భ‌లో సంతాపం తెల‌ప‌క‌పోవ‌డం మాత్రం జ‌గ‌న్‌రెడ్డి కుంచిత బుద్ధికి, ప్ర‌తీకార‌, క‌క్ష‌ సాధింపు చ‌ర్య‌ల‌కు నిద‌ర్శ‌నం అనే విమ‌ర్శ వినిపిస్తోంది. రెడ్డి కాదు కాబ‌ట్టి సంతాపం ప్ర‌క‌టించ‌లేదా? ఆర్య‌వైశ్యుడేగా అని చిన్న‌చూపు చూశారా? లేదంటే.. ఆనాడు వైఎస్సార్ మ‌ర‌ణం త‌ర్వాత త‌న‌కు ద‌క్కాల్సిన ముఖ్య‌మంత్రి కుర్చిలో రోశ‌య్య కూర్చున్నార‌ని ఇంతటి రివేంజా? ఆనాడు ఆయ‌న చ‌నిపోతే వెళ్ల‌లేదు.. ఇప్పుడు అసెంబ్లీలోనూ సంతాప తీర్మానం పెట్ట‌లేదు.. ఇది తెలుగుజాతి ముద్దుబిడ్డ‌ను.. ఆర్య‌వైశ్యుల ఆత్మ‌గౌర‌వాన్ని కించ‌ప‌రిచిన‌ట్టేన‌ని మండిప‌డుతున్నారు ఆ వ‌ర్గమంతా. 

రోశ‌య్య అనే కాదు.. ఇటీవ‌ల సుబ్బారావుగుప్తాను దారుణంగా తిట్టి, కొట్టి అవ‌మానించారు వైసీపీ నేత‌లు. ఇలా వ‌రుస సంఘ‌ట‌న‌ల‌తో ఆ వ‌ర్గ‌మంతా జ‌గ‌న్‌రెడ్డిపై, వైసీపీపై తీవ్ర అస‌హ‌నంతో ఉన్నారు. వారిని కూల్ చేసేందుకే అన్న‌ట్టు.. చింతామ‌ణి నాట‌కాన్ని నిషేధించి మ‌చ్చిగ చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో ఆ వ‌ర్గం కాస్త సైలెంట్ అయినా.. సుబ్బారావుగుప్తా మాత్రం గ‌ల్లీ నుంచి ఢిల్లీ స్థాయిలో ఒంట‌రి పోరాటం చేస్తున్నారు. త‌న‌ను కొట్టిన వారిని శిక్షించాలంటూ న్యాయం కోసం పోరాడుతున్నారు. జ‌గ‌న‌న్న రాజ్యంలో అలాంటి న్యాయం కోరుకోవ‌డం అత్యాశే అవుతుంద‌ని గుప్తాల‌కి ఈపాటికే తెలిసొచ్చే ఉంటుంది. ఇప్ప‌టికే అసంతృప్తితో ఉన్న వైశ్యులు.. తాజాగా ఏపీ అసెంబ్లీలో రోశ‌య్య మృతికి సంతాపం తెల‌ప‌క‌పోవ‌డంతో మ‌రింత ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నారు. సరైన స‌మ‌యంలో.. స‌రైన రీతిలో బుద్ధి చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. ఆర్య‌వైశ్యుల ఆత్మ‌గౌర‌వం కోసం సంఘ‌టితంగా పోరాడేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు.