త్వరగా ఢిల్లీ అసెంబ్లీ రద్దు చేయండి ప్లీజ్: కేజ్రీవాల్

 

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ని కోరారు. అసెంబ్లీని సాధ్యమైనంత త్వరలో రద్దు చేయాలని, లేకపోతే భారతీయ జనతాపార్టీ ఢిల్లీలో అధికారంలోకి రావడానికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు డబ్బు ఎరగా వేసే అవకాశం వుందని అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్‌తో భేటీ తర్వాత ఆ వివరాలను కేజ్రీవాల్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. తన విజ్ఞప్తికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి సరైన స్పందన లభించలేదని కూడా ఆయన ట్విట్ చేశారు. 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో గత ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ అండతో అధికారాన్ని చేపట్టినా, ఆ అధికారాన్ని నిలుపుకోలేక ప్రభుత్వాన్ని రద్దు చేసింది.