TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీకి ఆ ఐడియా ఇచ్చింది అరవింద్ కేజ్రీవాలే

Published on: Fri Jan 16, 2015 2:40PM

 

ఒకప్పుడు వారిరువురూ కలిసి పనిచేసేవారు. ఇరువురికీ కూడా ప్రజలలో చాలా మంచి పేరే ఉంది. కానీ క్రమంగా వారిరువురి దారులు వేరయ్యాయి. వారే ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ మరియు మాజీ ఐ.పి.యస్.ఆఫీసర్ కిరణ్ బేడీ. అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించినపుడు ఆయన నుండి దూరమయిన అన్నా హజారే చెంత చేరారు కిరణ్ బేడీ. అవినీతికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న పోరాటంలో కలిసి పనిచేసారు. కానీ ఇప్పుడు ఆమె కూడా బీజేపీలో చేరడంతో అన్నా హజారేకు ఏమి చెప్పాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది.

 

అయితే అందుకు కారకుడు మాత్రం అరవింద్ కేజ్రీవాల్ అనే చెప్పక తప్పదు. ఏవిధంగా అంటే, ఇటీవల డిల్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా అయన డిల్లీలో బీజేపీకి సమర్దుడయిన నాయకుడు లేడంటూ పదేపదే విమర్శలు గుప్పించారు. దానితో మేల్కొన్న బీజేపీ కిరణ్ బేడీని పార్టీలోకి ఆహ్వానించింది. అంతే కాకుండా ఆమెనే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి అరవింద్ కేజ్రీవాల్ పైనే పోటీకి దింపే ఆలోచనలో ఉందిప్పుడు. అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి సరయిన నేత లేడని ఎద్దేవా చేయకపోయుండి ఉంటే బహుశః బీజేపీకి కిరణ్ బేడీని పార్టీలో చేర్చుకోవాలనే ఆలోచన బీజేపీకి కలిగేది కాదేమో?

 

మంచి పోలీస్ ఆఫీసర్ అని పేరు గల ఆమెను ఇప్పుడు పార్టీలో చేర్చుకోవడమే కాకుండా అరవింద్ కేజ్రీవాల్ పైనే పోటీకి దింపాలని భావిస్తోంది. ఒకవేళ ఆమె తనపై పోటీ చేసినట్లయితే అరవింద్ కేజ్రీవాల్ సైతం ఆమెను వేలెత్తి చూపే సాహాసం చేయలేరు. కానీ ఆమె మాత్రం ఆయన 49రోజులలోనే ముఖ్యమంత్రి పదవి వదులుకోవడం గురించి విమర్శలు గుప్పించవచ్చును. బీజేపీలో ఆమె చేరికతో అరవింద్ కేజ్రీవాల్ పని కొరివితో తల గోక్కున్నట్లయింది.

 

డిల్లీలో రెండు ప్రధాన సమస్యలున్నాయి. వాటిలో మొట్ట మొదటిది మహిళలపై నానాటికి పెరిగిపోతున్న హత్యాచారాలు. రెండవది త్రాగు నీటి సమస్య. ఆ రెంటినీ కిరణ్ బేడీ చాలా సమర్ధంగా ఎదుర్కొనే శక్తి ఉందని అందరికీ తెలుసు. కనుక ఇక రోట్లో తలపెట్టేక రోకటి పోటుకి భయపడితే మాత్రం ఏమీ ప్రయోజనం లేదని “ఆమె రాజకీయాలలో చేరడాన్ని స్వాగతిస్తున్నాని” అరవింద్ కేజ్రీవాల్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసారు. రేపు జయప్రద కూడా బీజేపీలో చేరినట్లయితే, అరవింద్ కేజ్రీవాల్ పని నారీ నారీ నడుమ మురారి అయిపోతుంది.