టీడీపీ ధ్యాస దోపిడీ.. వైసీపీ ఆశ కుర్చీ..!
Published on: Thu Jul 5, 2018 10:32AM

గత ఎన్నికల్లో టీడీపీ,వైసీపీ మధ్య ప్రధాన పోటీ నడిచింది.. ఆ సమయంలో పవన్ జనసేన, టీడీపీకి మద్దతిచ్చింది.. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. పవన్ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధం అంటున్నారు.. ఇప్పటికే ఉత్తరాంధ్రలో యాత్రలు చేపడుతున్న పవన్.. అధికార పక్షం టీడీపీ, ప్రతిపక్షం వైసీపీ మీద ఘాటు విమర్శలు చేస్తున్నారు.. విశాఖ జిల్లా పెందుర్తిలో బుధవారం జరిగిన బహిరంగసభలో పవన్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు టీడీపీ నేతల భూ దోపిడీయే కారణమన్నారు.. వైసీపీ అధికారంలోకి వస్తే భూ దోపిడికీ దిగుతారన్న భావనతో గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చానని.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులే అన్ని రంగాల్లో దోపిడీకి తెగబడుతున్నారని ఆరోపించారు.. వైసీపీ అధినేతకు సీఎం కుర్చీ తప్ప ప్రజాసమస్యలు పట్టవని విమర్శించారు.. విశాఖ రైల్వే జోన్ కోసం టీడీపీ చేస్తున్న దీక్షలు డ్రామాగా పవన్ కొట్టిపారేశారు.. ‘దీక్ష చేస్తున్న ఒక ఎంపీకి మహాబద్ధకం.. అటూ ఇటూ కదలలేరు.. బరువు తగ్గించుకునేందుకే ఈ ప్రయాస అంతా’ అంటూ విమర్శలు చేశారు.. జనసేన సభలకు ఆటంకాలు సృష్టిస్తే సీఎం ఇంటి ముందు ధర్నాకు దిగుతానని పవన్ హెచ్చరించారు.


