న్యాయవ్యవస్థ మీద అరుణ్‌జైట్లీ దాడి

ఆయన బీజేపీలో ఓ ప్రముఖ నేత. దేశానికి ఆర్థికశాఖా మంత్రి. ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింపచేయాల్సిన వ్యక్తి. కానీ ఆయనే ఇప్పుడు ఎవరూ చేయలేని సాహసాన్ని చేస్తున్నారు. న్యాయవ్యవస్థని తరచూ దుమ్మెత్తి పోస్తున్నారు. స్వయంగా న్యాయవాది అయి ఉండి కూడా న్యాయమూర్తులకు చురకలంటిస్తున్నారు. బహుశా ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విషయంలో న్యాయస్థానాలు చూపిన దూకుడు జైట్లీగారి కడుపుమంటకు కారణం అయి ఉండవచ్చు. దీనికి తోడు కరువు, ఉపాధి హామీ పథకం వంటి అనేక అంశాలలో న్యాయస్థానాలు ప్రభుత్వానికి వేస్తున్న మొట్టికాయల నొప్పి ఆయనకి కూడా తెలుస్తూ ఉండవచ్చు. అందుకే  గత వారం పార్లమెంటులో మాట్లాడుతూ న్యాయవ్యవస్థ, చట్టవ్యవస్థను నాశనం చేస్తోందంటూ మండిపడ్డారు.

 

అక్కడితో ఆగారా అంటే నిన్నటికి నిన్న ఓ సమావేశంలో మాట్లాడుతూ న్యాయవ్యవస్థ ఒక లక్షణరేఖను పాటించాలనీ, అలా కాకుండా పరిపాలనలో జోక్యం చేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు. న్యాయానికి స్వేచ్ఛ పేరుతో చట్టవ్యవస్థ, పరిపాలనల్లోకి న్యాయస్థానాలు చొచ్చుకువస్తే భరించలేం అంటూ హెచ్చరికలు పంపారు. ఇప్పటికే వేతన జీవుల భవిష్య నిధి మీద పన్ను వేయాలని ప్రయత్నించి భంగపడిన జైట్లీ సాహెబ్‌, ఇప్పుడు న్యాయవ్యవస్థతో చెలగాటాలాడుతున్నట్లు కనిపిస్తోంది. అరుణ్‌జైట్లీ మీద దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ లేనిపోని విమర్శలకు దిగినప్పుడు, ఇదే న్యాయవ్యవస్థ ఆయనకు అండగా నిలబడిన విషయం బహుశా జైట్లీగారు మర్చిపోయినట్లున్నారు. ఏమైనా రాజకీయ నాయకులు కదా, మనకో న్యాయం ఇతరులకో న్యాయం అన్న సూత్రాన్ని పాటిస్తున్నారేమో!