మహాత్మునిపై అరుంధతీ రాయ్ అనుచిత వ్యాఖ్యలు

 

సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు, గౌరవం సంపాదించుకొన్న రచయితలు, రాజకీనాయకులు, కళాకారులు, సినీరంగానికి చెందినవారు అప్పుడప్పుడు నోరు జారి చిక్కుల్లో పడుతుంటారు. కానీ కొందరు కుహానా మేధావులు అహంకారంతోనో లేక తమ గొప్పదనం గురించి ప్రజలందరికీ చాటుకోవాలనే దురదతో ఉద్దేశ్యపూర్వకంగానే ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా అనుచితమయిన మాటాలు మాట్లాడుతుంటారు. ఆ కోవకు చెందిన వ్యక్తే ప్రముఖ రచయిత్రిగా పేరుపొందిన అరుంధతీరాయ్. ఆమె గొప్ప రచయిత, సామజిక కార్యకర్తే కావచ్చును. కానీ కేవలం భారతీయులే కాక యావత్ ప్రపంచమూ గౌరవించే మహాత్మాగాంధీనే విమర్శించే హక్కు ఆమెకు లేదనేచెప్పవచ్చును.

 

రెండు రోజుల క్రితం ఆమె ఒక సమావేశంలో మాట్లాడుతూ అసలు మహాత్మాగాంధీని జాతిపిత అనడమే చాల తప్పు అని ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపుతున్నాయి. అది ఇంకా చల్లారక మునుపే మొన్న తిరువనంతపురంలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మన దేశంలో అనేకమంది మహానుభావులు ప్రజల దృష్టిలో హీరోలుగా చలామణి అవుతున్నారు. కానీ వారందరూ నకిలీ హీరోలేనని మహాత్మాగాంధీని ఉద్దేశ్యించి అన్నారు. మహాత్మాగాంధీ కులతత్వాన్ని సమర్దించారని, ఆ విషయం అయన 1936లో స్వయంగా వ్రాసిన ‘ఆదర్శనీయ భాంగి’ అనే వ్యాసంలో పారిశుద్ధ పనివారు (ఆ కాలంలో ఆ పనిని హరిజనులు చేసేవారు) ప్రజలు విసర్జించిన మూత్రాన్ని, మలాన్ని ఎరువుగా మార్చాలని వ్రాయడం గాంధీజీ కులాహంకారానికి, దేశంలో కులతత్వాన్ని సమర్ధించే విధంగా ఆయన ఆలోచనలు సాగాయని చెప్పడానికి అదే ఒక నిదర్శనమని, అటువంటి వ్యక్తి పేరు సంస్థలకు, విశ్వవిద్యాలయాలకు పెట్టుకోవడం అనుచితమని, వాటిని మార్చుకొనే రోజులు దగ్గర పడుతున్నాయని ఆమె అన్నారు. గాంధీజీ గురించి మనం వ్రాసుకొన్న పాటాలన్నీ అబద్దాలతో నిండి ఉన్నవేనని ఆమె అన్నారు.

 

అరుదంతీ రాయ్ గొప్ప మేధావే కావచ్చును. కానీ ఆనాటి పరిస్థితులను బట్టి గాంధీజీ వ్రాసిన వ్యాసాన్ని పట్టుకొని దానికి తన తెలివితేటలతో వక్ర బాష్యం చెప్పి ఆయనకు కులతత్వాన్ని ఆపాదించాలని చూసి ఆమె తనొక కుహానా మేధావని రుజువు చేసుకొన్నారు. గాంధీజీ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతగా పోరాడారో అదేవిధంగా హరిజనుల గౌరవం కోసం పోరాడిన సంగతి భారతీయులు అందరికీ తెలుసు. ఆయన కులమతాలకు అతీతంగా భారతీయులందరూ అన్నదమ్ములవలె కలిసిమెలిసి సుఖంగా జీవించాలని కోరుకొన్నారు. మన దేశం నుండి పాకిస్తాన్ వేరే దేశంగా విడిపోతున్నపుడు ఆయన పడిన ఆవేదన గమనిస్తే ఆ విషయం అర్ధమవుతుంది.

 

భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత కావాలనుకొంటే ఆయనే స్వయంగా ప్రభుత్వాధినేతగా పగ్గాలు చెప్పట్టగలిగేవారు. కానీ ఆయన అటువంటి ఆలోచన చేయలేదు పైగా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ, ఆఖ్యాతిని ఉపయోగించుకొని అధికారం చెప్పట్టకుండా ఉండేందుకు దానిని వెంటనే రద్దు చేయాలని ఆయన కోరారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయన మాటను మన్నించలేదు. అయినప్పటికీ ఆయన అందుకు ఎవరినీ నిందించలేదు. దేశానికి మొట్ట మొదటి ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన నెహ్రూజీతో చాలా మర్యాదగా వ్యవహరించారు.

 

ఆ తరువాత కూడా ఆయన నిరాడంబర జీవనశైలిలో ఎటువంటి మార్పులు రాలేదు. ఇదంతా చరిత్ర పాటాలలో వ్రాయబడింది గనుక గుడ్డిగా నమ్మనవసరం లేదు. ఆనాడు జరిగిన ఈ సంఘటనలన్నీ సినిమాలు, వీడియోలు, ఫోటోలు తదితర దృశ్యరూపంలో నేటికీ మన కళ్ళెదుట సజీవంగానే ఉన్నాయి. అవి చూస్తే గాంధీజీ ఎందుకు మహాత్ముడయ్యారో అర్ధమవుతుంది. ఆ మాహాత్ముడి గొప్పదనం గురించి ఇటువంటి కుహానా మేధావులకి అర్ధం కాకపోవచ్చునేమో కానీ కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఉన్నకోట్లాది భారతీయులకు మాత్రం బాగానే తెలుసు. అందుకే ఆయన నేటికీ వారి హృదయాలలో కొలువయ్యున్నారు.

 

అరుంధతీ రాయ్ వంటి కుహాన మేధావులు తమ తెలివితేటలను దేశ అభివృద్ధికి, ప్రజలమధ్య శాంతి సామరస్యాలు నెలకొల్పడానికీ ఉపయోగించి ఉంటే అందరూ సంతోషించి ఉండేవారు. కానీ భారతీయుల హృదయాలలో సమున్నత స్థానం పొందిన మహాత్ముని గురించి ఇలా చెడు ప్రచారం చేసేందుకు తన తెలివితేటలను ఉపయోగించడం ఆమె అహంకారానికి, అజ్ఞానికి అద్దం పడుతోంది. ఆవిధంగా మాట్లాడటం వలన ఆమె పేరు తాత్కాలికంగా మీడియాలో నానవచ్చునేమో కానీ దానివల్ల పోయేది ఆమె పరువే తప్ప గాంధీ మహాత్ముడిది కాదు.