TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అరుణాచల్‌ ప్రదేశ్‌లోనూ గర్వభంగం

Published on: Wed Jul 13, 2016 1:03PM

 

సుప్రీంకోర్టు మరోసారి చారిత్రాత్మక తీర్పుని వెలువరించింది. అరుణాచల్ ప్రదేశ్‌లో అధికార పక్షాన్ని తోసిరాజని ఏర్పడిన ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ, పాత ప్రభుత్వమే కొనసాగాలని ఉత్తర్వులను అందించిది. ఈ తీర్పు నిజంగానే మోదీ ప్రభుత్వానికి శరాఘాతంగా భావించవచ్చు. రాష్ట్రపతి పాలన తరువాత ఒక ప్రభుత్వం ఏర్పడిపోయాక, ఆ ప్రభుత్వం చెల్లదనీ... ముందున్న ప్రభుత్వానికే పగ్గాలను అందించాలనీ, న్యాయస్థానం తీర్పుని వెలువరించడం మన దేశ చరిత్రలో ఇదే ప్రథమం. కాబట్టి ఉత్తరాఖండ్‌లో కలిగిన పరాభవం కంటే ఇది మరింత పెద్ద ఎదురుదెబ్బగా భావించవచ్చు.

 

అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధింపు అన్యాయం అంటూ మొదటినుంచీ నిరసన గళాలు వినిపిస్తూనే వస్తున్నాయి. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పక్షం నుంచి కొందరు సభ్యులు తిరుగుబాటు చేయగానే, ముందూవెనుకా ఆలోచించకుండా.... బలనిరూపణకు అవకాశం ఇవ్వకుండా, గవర్నరు జ్యోతిప్రసాద్‌ రాష్ట్రపతి పాలనను సూచించారు. జ్యోతిప్రసాద్‌ మాటకు సై అంటూ కేంద్ర క్యాబినెట్ జనవరి 26న అక్కడ రాష్ట్రపతి పాలనను విధించేసింది. పైగా ప్రతిపక్ష నేత అయిన కలికో పుల్ అధికారంలోకి వచ్చేలా పావులు కదిపింది. కానీ సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులతో కలికో పుల్ ఇప్పుడు గద్దె దిగక తప్పలేదు. జనవరి 26కి ముందువరకు ముఖ్యమంత్రిగా సాగిన నబామ్‌ టుకి తిరిగి అధికారంలోకి రాకా తప్పదు.

 

ఒకప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలను గద్దె దింపేందుకు రాష్ట్రపతి పాలనను పావుగా వాడుకునేది. అలాంటి విధానాలను ఖండిస్తూ అధికారంలోకి వచ్చిన బీజేపీ కూడా అదే దారి పట్టడం నిజంగా దురదృష్టకరం. అయితే అప్పటికీ ఇప్పటికీ ప్రజల ఆలోచనా ధోరణిలోనూ, న్యాయస్థానాల తీరులోనూ మార్పు వచ్చిందని గమనించకపోవడంతో.... తరచూ ఇలాంటి పరాభవాలను స్వీకరించాల్సి వస్తోంది. మరి ఇకనైనా కేంద్ర ప్రభుత్వం తన తీరు మార్చుకుంటుందా, లేకపోతే మరిన్ని మొట్టికాయలను సిద్ధపడుతుందా అన్నది త్వరలోనే తేలిపోతుంది.