తెలుగురాష్ట్లాల ఊసు లేదు... కామన్ మేన్ కళ్ళల్లో కారం

 

ఎప్పటిలాగే మరోసారి కేంద్ర బడ్జెట్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు మోడీ మొండిచేయే చూపించారు. 2018-19 వార్షిక బడ్జెట్ ను కేంద్ర ఆర్దికమంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈ బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా తెలుగు రాష్ట్రాల ఊసే ఎత్తలేదు. ముఖ్యంగా ఏపీ ప్రజలు గత నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ అంశం కనీసం ప్రస్తావనకు కూడా రాలేదు. ఓట్లు రానిచోట..ఎందుకు నిధులు ఇవ్వడం ఎందుకని అనుకున్నారనుకుంటా.. మళ్లీ ఏపీపై చిన్నచూపు చూపించింది. ఆంధ్రుల రాజధాని  అమరావతికి కోసం కానీ, మెట్రో రైలుకు కానీ..వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కానీ..ఎటువంటినిధులు ఇవ్వలేదు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి ఇచ్చిన హామీల్లో బడ్జెట్‌లో ఎటువంటి హామీలు ఇవ్వలేదు. రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కూడా బడ్జెట్‌లో హామీలు ఇవ్వలేదు. ఆంధ్రా దాదాపు 12500కోట్లు ఇవ్వాలని కోరితే...వంద కోట్లు మాత్రమే కేటాయించింది.విభజన హమీలకు బడ్జెట్‌లో మోక్షం లభిస్తుందన్న ఆశలకూ గండిపడింది.

 

అలాగని ఎవ్వరికీ ఏమీ ఇవ్వలేదని సరిపెట్టుకుందామా అంటే అదీ కాదు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రం కావాలసినన్ని నిధులు కేటాయించుకుంది. గుజరాత్, మహారాష్ట్ర లాంటి బీజేపీ పాలిట రాష్ట్రాలకు మాత్రం ఇవ్వాల్సింది ఇచ్చుకున్నారు.  వడోదరలో రైల్వే యూనివర్సిటీ ఏర్పాటును ఖరారు చేశారు. ముంబై సబర్బన్ విస్తరణకు, బెంగళూరు మెట్రోకి విచ్చలవిడిగా నిధులు విదిల్చేశారు. బెంగళూరు మెట్రోకు రూ. 17 వేల కోట్లు, ముంబై సబర్బన్ రైల్వేకు రూ. 17 వేల కోట్లను కేటాయించిన జైట్లీ... తెలుగు రాష్ట్రాలకు ఏమీ ప్రకటించలేదు. దీంతో, తెలుగు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ పెట్టుకున్న ఆశలూ నెరవేరలేదు. ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఎయిమ్స్‌ హామీలు ఆచరణకు నోచుకుంటాయన్న ఆశలు ఫలించలేదు. ఇక మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు నిధుల కేటాయింపుపైనా చాలా కాలంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్నికోరుతూ వస్తున్నా బడ్జెట్‌లో ఆ దిశగా ఎలాంటి చర్యలూ లేకపోవడంతో నిరాశ ఎదురైంది.

 

అంతేకాదు ఎంతో ఆశగా ఎదురుచూసిన కామన్ మేన్ కళ్ళల్లో కారం కొట్టేసింది కేంద్ర సర్కార్. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వేతనాల్ని...  ప్రతి ఐదేళ్లకొకసారి ఎంపీల జీతాల పెంచుకోవడం కోసం రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేసుకున్నారు. సగటు వేతన జీవి.. ఆశగా ఎదురుచూసిన ఐటీ పరిమితుల విషయంలో నీళ్లు నమిలేశారు అరుణ్ జైట్లీ. వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితుల్లో మార్పుల్లేవంటూ తేల్చి చెప్పారు.