బడ్జెట్ ఎఫెక్ట్: ఇవి పెరుగుతాయ్.. ఇవి తగ్గుతాయ్

 

కొత్తగా ఫోన్లు, టీవీని కొనాలని అనుకుంటున్నారా..? అయితే ఏమాత్రం లేట్ చేయకండి. ఎందుకంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి వీటి ధరలు పెరగనున్నాయి. సగటు భారతీయుడు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న 2018-19 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొబైల్ ఫోన్లు, టీవీలపై 15శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని 20 శాతానికి పెంచుతున్నట్లు ఆర్ధికమంత్రి వెల్లడించారు. పెంపుదల 5 శాతంగా కనిపిస్తున్నప్పటికీ వీటి ధర చెప్పుకోదగిన స్థాయిలో పెరుగనుంది. అలాగే టీవీ, మొబైల్ ఫోన్ల విడిభాగాల పైనా ఈ ప్రభావం పడనుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ ఫిట్ చేసే వివిధ విడిభాగాల మీద కూడా కస్టమ్స్ డ్యూటీని ఐదు శాతం పెంచారు.

 

దేశీయంగా మేక్ ఇన్ ఇండియాను ప్రొత్సహించే ఉద్దేశంతోనే ఈ పెంపుదల చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి వివిధ విదేశీ కంపెనీలు భారత్‌లోనే ప్లాంట్లను నెలకొల్పినప్పటికీ.. మరికొన్ని కంపెనీలు మాత్రం ఇంకా దిగుమతులు చేసుకుంటున్నాయి.. దీనిని నియంత్రించేందుకే కేంద్రం ఇలాంటి చర్యలకు దిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకా ధరలు పెరిగే వాటిలో వెండి, బంగారం, సన్‌స్కీన్, చెప్పులు, కూరగాయలు, పండ్ల రసాలు, పెర్‌ఫ్యూమ్స్, సోయా ప్రోటీన్ ఇతర ఆహార పదార్ధాలు, రంగురాళ్లు, వజ్రాలు, ఇమిటేషన్ జ్యూవెలరీ, స్మార్ట్ అలారాలు, సిల్క్ ఫాబ్రిక్స్, ఫర్నిచర్, పరుపులు, సిగరెట్లు, కొవ్వొత్తులు, వంటనూనెలు, క్రీడా పరికరాలు.

 

మరోవైపు పెరిగిపోతోన్న పెట్రోల్, డీజిల్ ధరలతో కుంగిపోతోన్న సామాన్యుడికి ఊరట కలిగించే ప్రకటన చేశారు జైట్లీ. బ్రాండెడ్, అన్‌బ్రాండెడ్ పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తద్వారా పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.2 మేర తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై మాత్రం జైట్లీ ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. వీటితో పాటుగా జీడిపప్పు, ముడిపదార్ధాలు, వైద్యపరమైన పరికరాలు, క్యాపిటల్ గూడ్స్ తదితరాల ధరలు తగ్గనున్నాయి.