TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జూన్ 30 అర్థరాత్రి… పార్లమెంట్లో ఏం జరగబోతోంది?

Published on: Thu Jun 29, 2017 12:35PM

జూలై ఒకటిన ఏం జరగనుంది? ఖచ్చితంగా మాట్లాడుకుంటే ఎవ్వరికీ ఏం అర్థం కావటం లేదు! జీఎస్టీ అమలు మొదలు కావటంతో ఏ ధరలు తగ్గుతాయి, ఏ ధరలు పెరుగుతాయి, మార్కెట్ ఏమవుతుంది… ఎవ్వరికీ అంతు చిక్కటం లేదు! కానీ, జూలై ఒకటవ తారీఖు ఉదయం ఏం జరిగినా, జరక్కపోయినా… జూన్ 30 పూర్తై ఒకటవ తేదీ మొదలవుతుంటే… అర్థ రాత్రి 12గంటల వేళ… దేశ పార్లమెంట్లో సూపర్ సందడి నెలకొననుంది! మరెందుకో కాదు, దేశ చరిత్రలోనే అతి కీలక ఆర్దిక మార్పుగా నిలవనున్న జీఎస్టీ కారణంగానే!

 

గతంలో రెండు సార్లు మాత్రమే భారత పార్లమెంట్ అర్థరాత్రి పూట సమావేశమైంది. ఒకసారి క్విట్ ఇండియా ఉద్యమానికి 50ఏళ్లు పూర్తైన సందర్భంగా సమావేశమైతే…  రెండో సారి మనకు స్వతంత్రం వచ్చి 50ఏళ్లు పూర్తైన తరుణంలో చోటు చేసుకుంది. అలాంటి చారిత్రక నేపథ్యం లేకున్నా మోదీ సర్కార్ జీఎస్టీ లాంఛ్ ఈవెంట్ ను అర్థ రాత్రి పూట గ్రాండ్ గా చేయటానికి నిర్ణయించింది! దాదాపు 6వందల మంది పొలిటీషన్స్, సెలబ్రిటీలు, బిజినెస్ మెన్, వివిధ రంగాలు నిపుణులు శుక్రవారం రాత్రి పార్లమెంట్ చేరుకోనున్నారు! ఇందులో అమితాబ్, లతా మంగేష్కర్, రతన్ టాటా లాంటి వారు చాలా మంది వున్నారు!

 

జీఎస్టీ లాంఛింగ్ సమయంలో వేదికపైన రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, ఆర్దిక మంత్రి జైట్లీతో పాటూ మాజీ ప్రధానులు మన్మోహన్, దేవెగౌడ కూడా వుండనున్నారు. దాదాపు గంట సేపు జరిగే ఈ స్పెషల్ జాయింట్ సెషన్లో ప్రధాని, రాష్ట్రపతి ప్రసంగాలు వుంటాయి. అలాగే జీఎస్టీ అధికారిక ప్రారంభం తరువాత రెండు చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ ప్లే చేస్తారు.

 

పార్లమెంట్లో ప్రాతినిధ్యం వున్న అన్ని పార్టీలకు ఆహ్వానం అందినపప్పటికీ మమతా బెనర్జీ ఎప్పటిలాగే మోదీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. తమ పార్టీ అర్థరాత్రి సమావేశం బహిష్కరిస్తుందని చెప్పేసింది. ఇక కమ్యూనిస్టులు ఆచారం ప్రచారం బీజేపి అనవసర హడావిడి చేస్తోందంటూ విమర్శించారు. వారు హాజరవుతారో లేదో గాని కాంగ్రెస్ మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతోంది. జీఎస్టీ ఆలోచన మొట్ట మొదట చేసింది కాంగ్రెస్సే. కాబట్టి ఇప్పుడు జీఎస్టీ లాంచ్ ఈవెంట్ కి వెళ్లకపోతే ఇంత వరకూ పడ్డ మార్కులు కూడా పోతాయని భయపడుతోంది హస్తం పార్టీ!

 

ఎవరు హాజరైనా, కాకున్నా ఎన్డీఏ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జీఎస్టీ బిల్లు వచ్చే ఎన్నికల్లో చక్కటి ప్రచార అస్త్రంగా ఉపయోగపడనుంది. అందుకే, మోదీ టీమ్ ఈ ఈవెంట్ ని ఇంత భారీగా ప్లాన్ చేస్తూ జనంలోకి తీసుకెళుతోంది…