ఎమ్మెల్యే రోజా భర్తపై అరెస్ట్ వారెంట్
Published on: Wed Apr 6, 2022 3:15PM
ప్రముఖ దర్శకుడు, దక్షిణ భారత చలనచిత్ర కార్మిక సంఘాల సమ్మేళనం అధ్యక్షుడు, వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్త ఆర్కే సెల్వమణిపై చెన్నై జార్జిటౌన్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. పరువునష్టం కేసులో విచారణకు సెల్వమణి హాజరు కాకపోవడంతో కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది.
2016లో సెల్వమణి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అన్బరసు ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోద్రా గురించి పలు అభిప్రాయాలు వెల్లడించారు. దీంతో బోద్రా వారిద్దరిపై జార్జిటౌన్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ముకుంద్ చంద్ బోద్రా మృతిచెందిన తర్వాత ఆ కేసును అతని కుమారుడు గగన్ బోద్రా కొనసాగిస్తున్నారు.
ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. సెల్వమణి, అరుళ్ అన్బరసు కోర్టు విచారణకు హాజరు కాలేదు. వారి తరఫున న్యాయవాదులు కూడా కోర్టుకు రాలేదు. దీంతో న్యాయమూర్తి వారిద్దరిపై బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీచేస్తూ తదుపరి విచారణను 23కు వాయిదా వేశారు.


