కూలిన ఆర్మీ హెలికాప్టర్.. బిపిన్ రావత్ సేఫేనా?
Published on: Wed Dec 8, 2021 1:07PM
తమిళనాడులోని ఊటీ సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. భారత సైన్యానికి చెందిన ఓ ఆర్మీ హెలికాప్టర్ సాంకేతిక కారణాలతో కూనూరులో కుప్పకూలింది. విల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఎంఐ సిరీస్ హెలికాప్టర్ బయల్దేరిన కాసేపటికే కూలిపోయింది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ బిపిన్ రావత్, మరో ముగ్గురు ఆర్మీ అధికారులు, రావత్ కుటుంబ సభ్యులు ఉన్నారు. హెలికాప్టర్ లో మొత్తం 14 మంది ఉన్నట్టు సమాచారం. ముగ్గురిని కాపాడినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. గాయపడినవారిని నీలగిరి జిల్లాలోని వెల్లింగ్టన్ కంటోన్‌మెంట్ ఆసుపత్రికి తరలించారు. హెలికాప్టర్ లో ఉన్న బిపిన్ రావత్ పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియడం లేదు.
విల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్ హెలికాప్టర్.. కాసేపటికే ఓ హోటల్ సమీపంలో కూలినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ముగ్గుర్ని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు దూరదర్శన్ న్యూస్ వెల్లడించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందినట్లు తెలుస్తోంది. 80శాతం కాలిన గాయాలతో ఇద్దరి మృతదేహాలను గుర్తించినట్లు సమాచారం.


