ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్

 

 

భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవనుంది. డిల్లీలో రాజకీయ దిగ్గజాలయిన కాంగ్రెస్, బీజేపీలను మట్టికరిపించిన ఆమాద్మీ (సామాన్యుడు) త్వరలో డిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేప్పట్టబోతున్నాడు. కాంగ్రెస్,బీజేపీల మద్దతు స్వీకరించడానికి నిరాకరించిన అమాద్మీపార్టీ, ఒక సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయం కోరుతూ రిఫరెండం నిర్వహించింది. అందులో అత్యధిక శాతం ప్రజలు కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పరచమని కోరడంతో, ఆమాద్మీ పార్టీ డిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకి తాము అంగీకరిస్తున్నట్లు కొద్ది సేపటి క్రితమే ప్రకటించింది. ఆ పార్టీకి చెందిన అరవింద్ కేజ్రీవాల్ మరో ముగ్గురు సహచరులతో కలిసి ఎటువంటి ఆర్భాటం, ఊరేగింపులు లేకుండా ఒక చిన్న కారులో డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీం జంగ్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమ సంసిద్దత తెలియజేసేందుకు బయలుదేరి వెళ్ళారు. ఆమాద్మీ పార్టీ తరపున అరవింద్ కేజ్రీవాల్ డిల్లీ ముఖ్యమంత్రిగా ఈనెల 26న ప్రమాణం స్వీకరించే అవకాశం ఉంది. ప్రజలను దూరంగా ఉంచే పాత సాంప్రదాయాలకు స్వస్తి పలుకుతూ, ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని డిల్లీ నగరం నడిబొడ్డున ప్రజల సమక్షంలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించాలని ఆమాద్మీ పార్టీ భావిస్తోంది.