కడపలో కరోనా కోర్ , బఫర్ జోన్స్ 

* కరోనా దృష్ట్యా ఆర్టీసీ కండక్టర్లకు స్పెషల్ డ్యూటీ 

కడప జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరగడంతో ఆర్టీసీ కండక్టర్ల సర్వీసులను కూడా జిల్లాలో అవసరమైన చోట వినియోగిస్తున్నారు.  జిల్లా వ్యాప్తంగా 23కు చేరుకున్నాయి కేసులు. దీంతో ఆంక్షలు కఠినతరం చేశారు పోలీసులు. రోజు రోజుకు కేసులు పెరుగుతుండటంతో అంక్షలను తీవ్రతరం చేస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎస్పీ అన్బురాజన్. నిత్యావసర వస్తువులు, కాయగూరల కొనుగోలుకు ఉదయం 5 నుంచి 8వరకే అనుమతిస్తున్నారు.

ఉదయం 8 గంటలు దాటితే ప్రజలు రోడ్లపై తిరక్కుండా అంక్షలు అమలులోకి వచ్చాయి. కడప నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ స్వయంగా పర్యవేక్షిస్తున్న ఎస్పీ అన్బురాజన్, డిఎస్పీ సూర్యనారాయణ, సిఐ, ఎస్ఐలు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇటుజిల్లాలో పర్యటించనున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ఇవాళ నగరానికి రానున్న డిఐజి లాక్ డౌన్ అమలుతీరును పరిశీలించనున్నారు. 
కోవిద్-19 కేసులు నమోదైన ప్రాంతాల్లో  భారీగా పోలీస్ బలగాలు మొహరించారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో అత్యవసర సేవల కోసం పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఆంక్షలను కాదని బయట తిరిగితే కఠినంగా వ్యవహరించక తప్పదని హెచ్చరించారు. అంక్షలను పాటించక పోతే కేసులు నమోదు చేస్తామన్నారు ఎస్పీ. 

కరోనా విషయంలో ఆర్టీసీ సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటోంది. వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని శాఖల సేవలను వినియోగించుకుంటోంది.ఈ నేపథ్యంలో జిల్లాలోని ఎనిమిది డిపోల పరిధిలో కండక్టర్లను వినియోగించుకుంటోంది. 560 మందిని వారి సొంత ప్రాంతాల్లోని పోలీసుశాఖకు అటాచ్‌ చేశారు. శుక్రవారం రాజంపేట డిపో పరిధిలోని నందలూరుకు చెందిన 13 మంది కండక్టర్లను స్థానిక పోలీసుస్టేషన్ కి కేటాయించారు.

డిపోల వారీగా రాజంపేటలో 90, కడప 90, ప్రొద్దుటూరు 100,రాయచోటి 100, జమ్మలమడుగు 70,పులివెందుల 60,మైదుకూరు 50 మంది కండక్టర్లను కరోనా వైరస్‌ నివారణ బాధ్యతలను అప్పగించారు. ఈ విధులను ఉద్యోగులు అంకితభావంతో చేస్తారని, దేశాన్ని రక్షించే బాధ్యతను తమకు కూడా అప్పగించడం సంతోషంగా ఉందని ఆర్టీసీ ఉద్యోగులు అంటున్నారు. మరోవైపు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన జిల్లా కేంద్రమైన కడపలో  ఇప్పటికే కోర్, బఫర్‌ జోన్లుగా విభజించారు. ప్రజలను బయటకు రానీయకుండా గట్టి చర్యలు తీసుకుంటోంది. దీంతోపాటు ఇతర పట్టణాల్లో కూడా జనం బయటికి రాకుండా నిత్యావసరాలను డోర్‌ డెలివరీ చేయించాలని సంకల్పించింది.అన్ని మున్సిపాలిటీలతోపాటు పంచాయతీల్లో కూడా గుర్తింపు కలిగిన సూపర్‌ మార్కెట్ల ద్వారా డోర్‌ డెలివరీకి నడుం బిగించింది.