ఆర్టీసీ ఛార్జీల మోత

 

APSRTC bus fares likely to go up, APSRTC bus fares, APSRTC hikes bus tickets

 

 

మరోసారి ఛార్జీల మోత మోగించేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. సంస్థకు వస్తున్న నష్టాలను నివారించి ఆర్థిక వనరులను పెంచుకోవడంలో భాగంగా ఛార్జీల పెంపు తప్పదని ఆర్టీసీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఛార్జీల పెంపు ప్రతిపాదనలతో నేడో ..రేపో మంత్రి బొత్స ముఖ్యమంత్రిని కలవనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆర్టీసీ రూ.400 కోట్ల నష్టాల్లో ఉండడం, విభజన ప్రకటన అనంతరం సీమాంధ్రలో ఉద్యోగుల సమ్మెతో రూ.745 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఈ మొత్తాన్ని ఒక్కసారిగా కాకుండా వాటిలో దాదాపు రూ.400 కోట్ల మేరకు భారాన్ని ప్రయాణికులపై మోపేందుకు చర్యలు చేపట్టింది.


ఆర్టీసీ మనుగడ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రవాణామంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించడం, పెరిగిన డీజిల్‌ ధరలకు అనుగుణంగా ఛార్జీలు పెంచుకోవడానికి అనుమతించడం ద్వారా సంస్థను కాపాడాలని ఇటీవల కొన్ని సంఘాలు ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. సమ్మె వల్ల కోల్పోయిన ఆదాయం రూ.745 కోట్లలో ప్రభుత్వం వాహన పన్ను మినహాయించడం ద్వారా ఆర్టీసీకి రూ.400 కోట్ల భారం తగ్గే అవకాశం ఉండగా రూ.345 కోట్లకు అదనంగా రూ.55 కోట్లను కలిపి డీజిల్‌ ఛార్జీల పెరుగుదల సర్దు బాటుగా ఛార్జీలు పెంచాలని అధి కారులు యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛార్జీల పెంపుపై అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. అందులోభాగంగా ప్రజల ఆగ్రహాన్ని చవిచూడకుండా ఉండేందుకు ఛార్జీలను కనీసం కిలో మీటర్‌కు పది పైసలు పెంచడం ద్వారా తాత్కాలికంగా కొంత మేరకు నష్టాలను నివారించు కోవాలని ఆర్టీసీ భావిస్తోంది.