TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఉచిత ప్రయాణాలకూ ఏసీ బస్సులు!

Published on: Thu Jan 29, 2026 9:45AM

ఆంధ్రప్రదేశ్ రవాణా రంగంలో కీలక మార్పులకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. త్వరలోనే రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్‌ బస్సులు రానున్నాయి.  ఈ విషయాన్ని మంత్రి  మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఆర్టీసీ కార్యాలయంలో నిన్న స్త్రీశక్తి పథకంపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో కలిసి  బుధవారం (జనవరి 28) నిర్వహించిన సమీక్షలో మాట్లాడిన ఆయన స్త్రీశక్తి పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఇప్పటివరకు సుమారు 40 కోట్ల రూపాయల మేర ఉచిత ప్రయాణాలు  చేశారన్నారు.

స్త్రీ శక్తి పథకాన్ని ప్రభుత్వం భారంగా కాకుండా,   బాధ్యతగా అమలు చేస్తోందన్నారు.  రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించేందుకు  అధునాతన సౌకర్యాలతో కూడిన ఎలక్ట్రిక్‌ బస్సులను త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు చెప్పారు. పల్లెవెలుగు సర్వీసుల్లోనూ ఏసీ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. మహిళలు ఉచితంగా ప్రయాణించేలా అన్ని ప్రాంతాల్లోనూ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు.  అనంతరం విజయవాడ బస్టాండ్‌లోని కార్గో సర్వీసు నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు.