TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ ప్రగతి పరుగులు.. అభివృద్ధికి ఆకాశమే హద్దు!

Published on: Tue Apr 7, 2026 3:29PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పరుగు రాష్ట్ర ముఖచిత్రాన్ని, రూపురేకలను మార్చే దిశగా సాగుతోంది.  మౌలిక సదుపాయాల రంగంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న  సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.

కోస్తా తీరం వెంబడి నర్సాపురం నుంచి బాపట్ల వరకు దాదాపు 120 కిలోమీటర్ల మేర ఈ  సీ షోర్ హైవే నిర్మాణం కానుంది. ముఖ్యంగా మచిలీపట్నం మీదుగా సాగే ఈ రహదారి, గతంలో ప్రతిపాదించిన జాతీయ రహదారి 216 విస్తరణకు ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చింది. భూసేకరణ ఇబ్బందులు, అధిక వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని, తక్కువ ఖర్చుతో వేగంగా పూర్తి చేసేలా ఈ తీరప్రాంత రహదారిని ప్రభుత్వం డిజైన్ చేసింది.

ఇది అందుబాటులోకి వస్తే మచిలీపట్నం, నిజాంపట్నం వంటి కీలక ఓడరేవుల మధ్య రవాణా  మరింత బలోపేతం అవుతుంది. కేవలం రవాణాకే పరిమితం కాకుండా, మత్స్య సంపద ఎగుమతులకు,  ఆక్వా రంగ అభివృద్ధికి ఇది అత్యంత కాలకంగా మారుతుంది. మరోవైపు, తీరప్రాంత పర్యాటక రంగం  కూడా ఈ రహదారి వల్ల అనూహ్యంగా పుంజుకుంటుంది.  కొత్త రిసార్టులు, స్థానిక వ్యాపారాల ఏర్పాటుతో ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.  

రాజధాని అమరావతి విషయంలోనూ కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని ప్రధాన నగరాలను కలిపే హై-స్పీడ్ రైల్ నెట్‌వర్క్‌లో అమరావతిని భాగం చేసింది. హైదరాబాద్ - చెన్నై కారిడార్‌ను అమరావతి మీదుగా మళ్లించడం ద్వారా..  దక్షిణ భారతదేశంలోని మెట్రో నగరాలకు రాజధాని అమరావతి మరింత చేరువ అవుతుంది.

అలాగే చెన్నై - మైసూరు  కారిడార్ కూడా ఏపీకి అదనపు బలాన్ని ఇస్తుంది. ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు కొత్త రైల్వే లైన్,  కృష్ణా నదిపై నిర్మించ తలపెట్టిన భారీ రైల్వే బ్రిడ్జ్ భవిష్యత్తులో ఐకానిక్ స్ట్రక్చర్‌గా నిలవనుంది. ఈ రెండు మెగా ప్రాజెక్టుల కలయికతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తీరప్రాంత జిల్లాల్లో వాణిజ్య కార్యకలాపాలు పెరగడం, అమరావతికి అంతర్జాతీయ స్థాయి కనెక్టివిటీ లభించడం ద్వారా రాష్ట్రం పెట్టుబడులకు చిరునామాగా మారుతుందనడంలో సందేహం లేదు.