ఏప్రిల్‌ ఫూల్స్‌ డే రోజు సందడే!

 

ఏప్రిల్‌ 1వ తేదీ వచ్చిందంటే ఏప్రిల్‌ ఫూల్స్‌ డేనే గుర్తుకువస్తుంది. ఏదో ఆడతూ పాడుతూ అవతలివారిని ఏడిపించే ఈ రోజు వెనక బోలెడు కథ ఉంది. వేర్వేరు దేశాలలో ఆ వేడుకలని జరుపుకొనే తీరులోనూ వైవిధ్యం కనిపిస్తుంది.

 

పసలేని వాదన

ఒకప్పుడు ఆంగ్ల సంవత్సరం మార్చి 25న మొదలయ్యేది. ఆ సంవత్సర వేడుకలు వారం పాటు, అంటే ఏప్రిల్‌ 1 వరకూ జరిగేవి. కానీ 1582లో గ్రెగోరియన్‌ కేలెండర్‌ అమలులోకి రావడంతో కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. ఈ మార్పుని అనుసరించకుండా ఏప్రిల్‌ 1న కొత్త సంవత్సరాన్ని ఆచరించేవారిని ఏప్రిల్‌ ఫూల్‌ అని పిలుస్తారనేది చాలా పాత వాదన. కానీ 15వ శతాబ్దానికి ముందే ఇలాంటి ఆచారాలు ఉండేవని తెలుస్తోంది. 13వ శతాబ్దంలో వచ్చిన పుస్తకాలలో కూడా ఏప్రిల్‌ ఫూల్‌ ప్రస్తావన కనిపిస్తుంది. కాబట్టి ఇది అనాదిగా వస్తున్న ఆచారమే అనుకోవచ్చు.

 

ఒకో దేశంలో ఒకోలా

ఏప్రిల్‌ ఫూల్‌ రోజున అవతలివారిని ఏదో ఒక విషయంలో దారిమళ్లించి వెధవాయిలని చేయడం సహజమే! కాకపోతే కొన్ని దేశాలలో ఇదే ఆచారాన్ని కాస్త విభిన్నంగా పాటిస్తారు.

 

- ఫ్రాన్స్‌లో చేప ఆకారంలో ఉన్న ఒక కాగితాన్ని అవతలివారికి తెలియకుండా వీపు మీద అంటిస్తారు. దీనిని ఏప్రిల్‌ ఫిష్‌ అంటారు.

- పోర్చుగల్‌ దేశంలో ఒకరి మీద ఒకరు పిండి చల్లుకుంటారు.

- డెన్మార్కులో ఏప్రిల్‌ 1వతో పాటు మే 1న కూడా అవతలివారిని వెర్రివెంగళాయిలను చేసే ప్రయత్నం చేస్తారు.

- ఐర్లాండులో ‘ఏప్రిల్‌ ఫూల్‌’ కోసం అనే ఉత్తరాన్ని కవరులో ఉంచి ఒకరి నుంచి వేరొకరికి అందిస్తూ ఉంటారు.

- ఇంగ్లండులో ఏప్రిల్‌ 1 మధ్యాహ్నం వరకే ఫూల్‌ చేయవచ్చు. ఆ తరువాత ఎవరినన్నా ఫూల్‌ చేయాలని ప్రయత్నిస్తే మనల్నే ఫూల్స్‌గా జమకడతారు.

 

మీడియా హడావుడి:

 ఏప్రిల్‌ ఫూల్‌ రోజున జరిగే సందడిని జనాలకి చేరవేడమే కాదు.... ఆ రోజు తామే స్వయంగా జనాల్ని ఏప్రిల్‌ ఫూల్‌ చేసే ప్రయత్నం చేస్తుంటాయి కొన్ని మీడియా సంస్థలు. లేని వార్తను ఉన్నట్లుగా, జరగనిదానిని జరిగినట్లుగా ప్రచురించి జనాల్ని ఫూల్స్ చేస్తుంటాయి. ఇవి ఒకోసారి వివాదాస్పదం అవుతుంటాయి కూడా! ఉదాహరణకి 1957లో బీబీసీ టీవీ ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. పూల తీగలను పెంచినట్లే తినే నూడిల్స్‌ (spaghetti) కాసే చెట్లని కూడా పెంచవచ్చని ఆ కథనంలోని సారాంశం. అప్పట్లో నూడిల్స్ తయారీ గురించి అంతగా అవగాహన లేని బ్రిటన్‌వాసులు ఈ వార్త నిజమేనని నమ్మి... సదరు చెట్లను ఎలా పెంచాలా అని పరిశోధన మొదలుపెట్టేశారు. మీడియా ద్వారా అతి పెద్ద ఏప్రిల్‌ ఫూల్‌ జోక్‌ అని ఇప్పటికీ ఆ ఘటనను తల్చుకుంటారు.

 

ఇవీ ఏప్రిల్‌ ఫూల్స్ విశేషాలు! ఏప్రిల్‌ ఫూల్‌ హద్దులో ఉంటే ఆరోగ్యకరమైన హాస్యానికి దారితీస్తుందనీ, హద్దులు దాటితే అవతలివారి మనోభావాలని దెబ్బతీస్తుందనీ పెద్దలు చెబుతున్నారు. ఆ హద్దులేవో పాటిస్తే పోలా!


- నిర్జర.