TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సంవత్సరానికి 2 పిచ్చోళ్ల దినాలు… ఎవరి ‘పిచ్చి’ వారికానందం!

Published on: Sat Apr 1, 2017 3:56PM

ఏప్రిల్ ఒకటి అంటే కొత్త ఆర్దిక సంవత్సరం మొదలయ్యే రోజు! కాని, దాని గురించి కంటే ఎక్కువ మందికి తెలిసింది ఫూల్స్ డేనే! ప్రపంచ వ్యాప్తంగా ఏప్రెల్ ఒకటిని ఫూల్స్ డేగా జరుపుకుంటారు. ఇండియాలో కూడా జనాన్ని పిచ్చోళ్లని చేయటానికి చాలా మంది ట్రై చేస్తుంటారు! కొన్ని సార్లు ప్రయత్నం బెడిసికొట్టి జోక్ మొదలు పెట్టిన వాడే ఫూల్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు!

 

ఫూల్స్ డే జరుపుకోవటం పక్కన పెడితే…. దీని వెనుక వున్న కథ భలే ఆసక్తికరంగా వుంటుంది! 15వ శతాబ్దంలో పోప్ గ్రెగోరీ యూరోపీయన్ల కొత్త సంవత్సరాన్ని ఏప్రెల్ నుంచి జనవరికి మార్చేశాడు. జనవరి ఒకటిన న్యూ ఇయర్ జరుపుకోవటం అలా మొదలైంది. అయితే, ఇప్పటిలా కమ్యూనికేషన్లు లేని ఆ సమయంలో కొందరు పాత పద్ధతిలోనే ఏప్రెల్ ఒకటిన కొత్త సంవత్సరం జరుపుకునేవారట! వాళ్లని ఫూల్స్ అనటంతో ఈ ఫూల్స్ డే మొదలైందంటారు!

 

బ్రిటీషర్స్ మన దేశంలోకి వచ్చాక కూడా ఇక్కడ ఏప్రెల్ లో వచ్చే ఉగాది పండగనాడు కొత్త సంవత్సరం జరుపుకోవటం చూసి… వాళ్లు మనల్ని ఫూల్స్ అనుకున్నారని అంటారు! ఇందులో నిజం ఎంతో తెలియదుగాని… మార్చ్ , ఏప్రెల్ నెలల్లో వసంతం వస్తుంది. అప్పుడు ప్రకృతిలో అందమైన మార్పులు తొంగిచూస్తాయి. అందుకే, వేల ఏళ్లుగా వేసవి ప్రారంభంలో కొత్త సంవత్సరం జరుపుకోవటం అనవాయితీ! అది పట్టించుకోకుండా యూరోపియన్లు జనవరికి కొత్త సంవత్సరాన్ని మార్చేసుకుని… అలా చేయని వారినందర్నీ ఫూల్స్ అనటం… నిజంగా ఫూలిష్ నెస్సే! అయినా… ఫూలే తాను తప్ప మిగతా వారు ఫూల్స్ అనుకుంటాడు కదా… ఇదీ అంతే!

 

ఏప్రెల్ ఫస్ట్ న వచ్చే ఈ ఫూల్స్ డే కాకుండా మరో పిచ్చోళ్ల దినం కూడా వుంది! స్పెయిన్, లాటిన్ అమెరికా దేశాల్లో డిసెంబర్ 28న ఫూల్స్ డేనట! ఆ రోజున బైబిల్ లో చెప్పిన ఓ రాజు అమాయక యువకుల్ని చాలా మందిని చంపించాడట! మరి అటువంటి విషాదానికి, ఫూల్స్ డేకి సంబంధం ఏంటి? ఏమో! జరుపుకునేవారికే తెలియాలి!

 

ఏప్రెల్ వచ్చే ఫూల్స్ డేనాడు ఊరికే జోక్స్, ప్రాంక్స్ తో సరిపెడితే… డిసెంబర్ 28న వచ్చే ఫూల్స్ డేనాడు కాస్త హంగామా ఎక్కువే వుంటుంది. స్పెయిన్ లో అయితే పిండి యుద్ధం చేస్తారు! రెండు వర్గాలుగా జనం విడిపోయి ఒకరి మీద ఒకరు పిండి చల్లకుంటూ కోడిగుడ్లు, నీళ్లు ప్రయోగించుకుంటారట! దీనికి కూడా కారణం అంటూ ఏం చెప్పలేం! ఆఫ్ట్రాల్… పిచ్చోళ్ల డే కాబ్టటి… ఎవరి పిచ్చి వారికానందం!