ఏపీ ఉద్యోగుల మనసు కరగదా?



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగకూడదని ఏపీ ఎన్జీవోలు భారీ స్థాయిలో ఉద్యమం చేశారు. అంతవరకు ఓకే. రాష్ట్రం విడిపోకూడదని ఉద్యోగులు ఎంత బలంగా కోరుకుంటున్నారో అని అప్పట్లో వారిమీద సదభిప్రాయం కలిగింది. ప్రభుత్వ ఉద్యోగుల మీద అప్పటి వరకూ వ్యతిరేకతను వ్యక్తం చేసేవారు కూడా ఉద్యోగులు సమైక్య ఉద్యమం చేసిన తీరు చూసి తమ అభిప్రాయాలను మార్చుకున్నారు. రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత ఏపీ ఎన్జీవోల నాయకులు ఆంధ్రప్రదేశ్‌లో చెట్లకింద అయినా పనిచేయడానికి సిద్ధం అని ప్రకటించేసరికి ఏపీ ప్రజలందరూ ఉద్యోగుల ఔదార్యం చూసి మురిసిపోయారు. అయితే  కాలం గడుస్తున్నకొద్దీ ఉద్యోగుల తీరు చూసి ఏపీ ప్రజలకు కళ్ళు తిరుగుతున్నాయి.

ఏపీ కొత్త రాజధానిలో చెట్లకింద కూర్చుని అయినా పనిచేస్తామని గతంలో ప్రకటించిన ఉద్యోగ సంఘాల నాయకులు ఇప్పుడు కొత్త రాజధాని పేరు చెబితేనే రాము పొమ్మంటున్నారు. తమకు అక్కడ సౌకర్యాలు, సదుపాయాలు వుండవని అందువల్ల ఇప్పుడప్పుడే కొత్త రాజధానికి రానే రామంటూ నిర్మొహమాటంగా చెబుతున్నారు. ఉద్యోగుల ఈ తీరు చూస్తే, అప్పట్లో వీరు చేసిన సమైక్య ఉద్యమం మీద కూడా అనుమానాలు కలుగుతున్నాయి. వీరు చేసిన ఉద్యమం తమ ఉద్యోగాలకు స్థానభ్రంశం కలుగుతుందన్న ఆందోళనతో చేసిందే తప్ప, తెలుగుజాతి విడిపోతుందన్న బాధతో కాదని అర్థమవుతోంది.

కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థికంగా అన్నీ వున్న తెలంగాణ రాష్ట్రం తమ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే, ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో వున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంతే ఫిట్‌మెంట్ ఇచ్చింది. ఇంత చేసిన ముఖ్యమంత్రి బతిమాలుతున్నా ఉద్యోగులు హైదరాబాద్‌ దాటి వెళ్ళడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం శ్రమిస్తోందే తప్ప.. ప్రభుత్వానికి తమవంతు సహకారం అందించాలన్న ఆలోచన మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు రాకపోవడం బాధాకరం. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగుల మనసులు కరగలేదు. ముందుముందు కరుగుతాయన్న ఆశ కూడా కలగడం లేదు.