అప్పుడలా ఇప్పుడిలా.. సుప్రీం తీర్పు తర్వాత స్వరం మారింది!

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణను ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతల స్వరం మారింది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. తాము ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఆరోగ్యం సరిగా లేని ఉద్యోగులను మినహాయించి, మిగిలిన ఉద్యోగులతో ఎన్నికలను నిర్వహించుకోవచ్చని తాము సూచించామని తెలిపారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాతైతే ఉద్యోగులందరూ ఎన్నికల విధుల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పు తరువాత వెంకట్రామిరెడ్డి మాటలు.. గత రెండు రోజులుగా మాట్లాడిన మాటలకు భిన్నంగా ఉన్నాయి. అంతకుముందు ఎన్నికల సంఘం పై తీవ్రంగా స్పందించిన ఆయన.. తాము ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని ఎప్పుడూ చెప్పలేదంటూ ఇప్పుడు మాట మార్చడం హాట్ టాపిక్ గా మారింది.