TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయవాడలో షర్మిల హౌస్ అరెస్టు

Published on: Wed Apr 30, 2025 12:39PM

ఆంధ్రప్రదేశ్  కాంగ్రెస్  అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. బుధవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో  పోలీసులు పెద్ద సంఖ్యలో విజయవాడలోని   షర్మిల నివాసానికి  చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకుని గృహ నిర్బంధంలో ఉంచారు.  ఈ విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు హుటాహుటిన షర్మిల నివాసానికి చేరుకుని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఆమెను ఎందుకు హౌస్ అరెస్ట్‌లో ఉంచారంటూ నిలదీశారు. తనను అకారణంగా హౌస్ అరెస్ట్ చేశారంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎందుకు హౌస్ అరెస్టు చేశారో కనీసం కారణం కూడా చెప్పలేదన్నారు.  

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  తన వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు చెబుతున్నారని, ఎలా ఉత్పన్నమౌతుందో చెప్పలేకపోతున్నారని షర్మిల పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కులను సైతం ఏపీ ప్రభుత్వం కాలరాస్తోందంటూ షర్మిల ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎందుకు ఇంతగా భయపడుతోందని నిలదీశారు. 

ఇలా ఉండగా వచ్చే నెల 2న ప్రధాని నరేంద్రమోడీ ఉద్దండరాయుని పాలెంలో పర్యటించనున్నారు. అమరావతి పనుల పున: ప్రారంభానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల బుధవారం (ఏప్రిల్ 30) ఉద్దండరాయుని పాలెంలో పర్యటించాలని నిర్ణయించారు.

అయితే మోడీ పర్యటన, సభ ఏర్పాట్ల నేపథ్యంలో షర్మిలను ఉద్దండరాయున పాలెంలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు పోలీసులు ఆమెను విజయవాడలోని ఆమె నివాసంలోనే అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారు. మోడీ పర్యటన సందర్భంగా ఆంక్షలు విధించినట్లు తెలపిన పోలీసులు ఆమెను ఉద్దండరాయని పాలెంలో పర్యటించకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో తీవ్ర టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్దండరాయని పాలెం వెడతానంటూ షర్మల భాష్మించారు. తనను అనుమతించకుంటే ధర్నాకు దిగుతాననీ, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా నిరశన దీక్ష చేపడతానని షర్మిల హెచ్చరించారు.