తెలుగు రాష్ట్రాలకు చేరిన కోవిడ్ టీకాలు! 

కోవిడ్ వ్యాక్సిన్లు తెలుగు రాష్ట్రాలకు చేరుకున్నాయి. ఏపీకి కేటాయించిన వ్యాక్సిన్లు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోగా.. తెలంగాణ వ్యాక్సిన్లు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చాయి. తొలి దశలో ఏపీకి ఐదు లక్షల డోసులు, తెలంగాణకు నాలుగన్నర లక్షల డోసుల వ్యాక్సిన్ వచ్చినట్లు అధికారుల సమాచారం. హెడ్ క్వార్టర్ నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్ డోస్‌లు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రాల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరుకుంటాయి. పోలీసు భద్రత నడుమ గ్రామస్థాయి వరకు వ్యాక్సిన్ వెళ్లినట్లుగానే వీటి నిల్వ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనే చేపట్టేలా ఫ్రీజర్లు, ఐస్ లైన్ రిఫ్రిజిరేటర్లను వైద్యారోగ్య శాఖ సమకూర్చింది.  ఈ నెల 16వ తేదీన వ్యాక్సినేషన్ లాంఛనంగా ప్రారంభం కానుంది. ప్రతీ వ్యాక్సినేషన్ కేంద్రంలో డాక్టరుతో పాటు వ్యాక్సిన్ వేయడానికి శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలర్జీ, రియాక్షన్ లాంటివాటిని పరిశీలించడానికి అబ్జర్వేషన్ రూమ్‌లు, హెల్త్ కేర్ సిబ్బంది వేచి ఉండడానికి వెయిటింగ్ హాళ్ళు ఏర్పాటయ్యాయి.వ్యాక్సిన్‌ వేయించుకునే ప్రతిఒక్కరూ ఆధార్‌ కార్డును తప్పనిసరిగా తీసుకురావాలి. వ్యాక్సినేషన్‌ అయిపోయిన అనంతరం వీరి వివరాలు కో–విన్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదుచేస్తారు.

ఏపీకి కోవిషీల్డ్‌, కొవాగ్జిన్‌  టీకాలు వచ్చాయని సమాచారం. ఏపీకి తొలివిడత కింద సుమారు 5 లక్షల డోసులు రాగా.. ఇందులో సుమారు 4 లక్షల డోసులు పుణెలోని సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌ టీకా ఉన్నట్లు సమాచారం.  ఏపీలో తొలివిడత కింద 3,82,899 మంది ఆరోగ్య సిబ్బందికి టీకా వేస్తారు. వీరి వివరాలను కొవిన్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. మొత్తం 1,940 పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అర్హులందరికీ టీకా వేయాలంటే 40,410 కేంద్రాలు అవసరం అవుతాయని అంచనా. 17,775 మందికి వ్యాక్సినేటర్లను సిద్ధం చేశారు. 

వ్యాక్సిన్ పంపిణి కోసం  తెలంగాణలో  తొలి రోజు 139 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇందులో 40 ప్రైవేటు ఆసుపత్రులలో ఉంటే మిగిలిన 99 ప్రభుత్వాసుపత్రులలోనే ఏర్పాటయ్యాయి. ప్రతీ కేంద్రంలో రోజుకు వంద మంది చొప్పున వ్యాక్సిన్ ఇచ్చేలా రంగం సిద్ధమైంది. ‘ఇప్పటికే సుమారు 2.90 లక్షల మంది పేర్లు ‘కొవిన్’లో నమోదయ్యాయి. తొలి రోజున 13,900 మందికి మాత్రమే వ్యాక్సినేషన్ ఉంటుంది. 18వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1200 కేంద్రాలలో మొత్తం 1400 సెషన్లలో వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. కొన్ని చోట్ల అనుబంధ వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటవుతున్నందున రోజుకు 1.40 లక్షల మందికి ఇవ్వాలని ప్లాన్ రెడీ అయింది.
 
 మంగళవారం తెల్లవారుజాము నుంచి  కరోనా వ్యాక్సిన్‌ కొవిషీల్డ్‌ను రూపొందించిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ తొలి విడత టీకా సరఫరా ప్రారంభించింది. పుణెలోని తయారీ కేంద్రం నుంచి టీకా డోసుల్ని మూడు ప్రత్యేక ట్రక్కుల ద్వారా తరలించారు.  కట్టుదిట్టమైన భద్రత నడుమ వీటిని పుణె విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేశారు. రవాణా కోసం జీపీఎస్‌ సౌకర్యమున్న ట్రక్కులను వినియోగించారు. తొలి విడత డోసులు పుణె నుంచి దిల్లీ, అహ్మదాబాద్‌, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కర్నాల్‌, హైదరాబాద్‌, విజయవాడ, గువాహటి, లఖ్‌నవూ, చండీగఢ్‌, భువనేశ్వర్‌కు చేరాయి. ఇందుకోసం మొత్తం 8 ప్రత్యేక వాణిజ్య, 2 కార్గో విమానాలను వినియోగించారు. తొలి కార్గో విమానం హైదరాబాద్‌, విజయవాడ, భువనేశ్వర్‌కు .. మరొకటి కోల్‌కతా, గువాహటికి వెళ్లింది.
ముంబయికి రోడ్డుమార్గం ద్వారా టీకా డోసులను సరఫరా చేస్తున్నారు. ఎయిరిండియా, గోఎయిర్‌, ఇండిగో, స్పైస్‌ జెట్‌కు చెందిన విమానాలను ఈ రవాణా కార్యక్రమంలో ఉపయోగిస్తున్నారు.