కేటీఆర్,జగన్ భేటీపై టీడీపీ నేతల స్పందన


 

టీఆర్‌ఎస్ నేత కేటీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ భేటీపై ఏపీ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. భేటీపై మంత్రి దేవినేని ఉమ స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ది ఫెడరల్ ఫ్రంట్‌ కాదని, మోడీ ఫ్రంట్‌ అని ఎద్దేవాచేశారు. ముగ్గురు మోడీల జగన్నాటకమని దుయ్యబట్టారు. కేసీఆర్‌ దూషణలను ఏపీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, ఏపీ ప్రజలను తిట్టిన కేసీఆర్‌తో కలవడానికి జగన్‌కు సిగ్గుండాలన్నారు. హైదరాబాద్‌లో ఏపీ వాళ్లు కిరాయిదారులే అన్నారని, ఏపీ బ్రాహ్మణులకు మంత్రాలు కూడా రావని తిట్టారని దేవినేని ఈ సందర్భగా గుర్తుచేశారు. లంకలో పుట్టినవాళ్లు అందరూ రాక్షసులేనని కేసీఆర్‌ తిట్టలేదా అని ప్రశ్నించారు. తెలుగు తల్లి అంటే దెయ్యమని కేసీఆర్‌ దూషించారని, ఆంధ్రావాళ్ల బిర్యాని పేడలా ఉంటుందని కేసీఆర్‌ అనలేదా అని మరోసారి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుపై కక్షతో కేసీఆర్‌ నీచరాజకీయాలు చేస్తున్నారని దేవినేని ఉమ దుయ్యబట్టారు.

భేటీపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కామెంట్లు చేశారు. తెలంగాణ నుంచి వచ్చి బురద చల్లడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని దివాకర్‌రెడ్డి అన్నారు. ఎవరు ఎంత మందిని కలిసినా టీడీపీ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. వైసీపీ, టీఆర్ఎస్ దోస్తీ గురించి తమకు ముందే తెలుసన్నారు. వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు కలవడం ఏంటి.. ఏడాది నుంచే కలిసి పనిచేస్తున్నాయని జేసీ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నారు. దేశంలో ఎవరు ఎక్కడికైనా రావొచ్చని తెలిపారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ లేదు.. పాడు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్కోసారి ఒక్కొక్కరికి కోపం వస్తుందని, ఇప్పుడు కేసీఆర్‌కు వచ్చిందని తెలిపారు.

భేటీపై మంత్రి నారాయణ కూడా స్పందించారు. ఇంతవరకు తెర వెనుక ఉన్న ముగ్గురు మోడీల డ్రామా ఇప్పుడిప్పుడే తెర మీదకు వస్తోందని నారాయణ వ్యాఖ్యానించారు. వైసీపీ, టీఆర్ఎస్ చర్చలతో ఆ విషయం బట్టబయలైందన్నారు. విభజన హామీలు నెరవేర్చాల్సిన మోడీని వదిలిపెట్టి, రాష్ట్రం కోసం పోరాడుతున్న చంద్రబాబుపై దాడి చేయడం  విడ్డూరమన్నారు. జగన్ కేసుల మాఫీ కోసం ప్రధానమంత్రితో లాలూచీ పడ్డారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించాలంటే బీజేపీలేని కేంద్ర ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. మోడీకి తెరవెనుక సహకరించేందుకే కేసీఆర్ మూడో ఫ్రంట్ ను తెరమీదకు తెస్తున్నారని విమర్శించారు.