TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముగిసిన అధ్యాయమా..? కథ ఇంకా ఉందా..?

Published on: Mon Jun 5, 2017 2:48PM

ఏపీలో మళ్ళీ ప్రత్యేక హోదాగ్ని రగిలింది. కొంతకాలంగా సబ్దుగా ఉన్న అంశాన్ని మరోసారి మేల్కొలిపింది కాంగ్రెస్ పార్టీ. హోదా వచ్చేవరకు పోరు ఆగదని హెచ్చరించింది. గుంటూరు సభతో ప్రత్యేక హోదా ఆకాంక్ష మరోసారి బలంగా వినిపించింది. దేశంలోని ప్రముఖ పార్టీల నేతలంతా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని నినదించారు. ఈ దెబ్బతో హోదా డిమాండ్ మళ్ళీ ప్రముఖంగా తెరపైకి వచ్చింది. కానీ కేంద్రం మాత్రం మెట్టు దిగే పరిస్థితి కనిపించడం లేదు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమనే చెబుతోంది. ప్యాకేజీతో నవ్యాంధ్ర బతుకు చిత్రం మారేస్తామంటోంది. కేంద్రం మాటలకు చంద్రబాబు అండ్ కో కూడా వంత పాడుతోంది. తాజాగా నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగరియా కూడా మరోసారి ప్రత్యేక హోదా కథ ముగిసిందని తేల్చేశారు. 

 

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమో కాదో గానీ..భవిష్యత్తులో మాత్రం ఇదే అంశం కీలకంగా మారే ఛాన్స్ కనిపిస్తోంది. 2019 ఎన్నికల నాటికి ఇదే బలమైన డిమాండ్ అవ్వబోతోంది. ఏపీలోని విపక్ష పార్టీలకు ప్రత్యేక హోదా ఒక వరంగా మారబోతోందన్నది నిజం. ప్రజల్లో ఉన్న భావోద్వేగాన్ని క్యాష్ చేసుకోవడానికి అన్ని పార్టీలు శక్తి వంచన లేకుండా ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది. 

 

జనసేనాని పవన్ కల్యాణ్ , వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే ప్రత్యేక హోదా గళం గట్టిగా వినిపించారు. జగన్ అయితే రాజీనామాలకు సైతం సై అన్నారు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ కూడా ఇప్పుడు ప్రత్యేక హోదా అంశాన్నే ఫోకస్ చేస్తోంది. ప్రత్యేక హోదా భావోద్వేగ సమస్య కాదనీ.. రాష్ట్ర జీవన్మరణ సమస్య అనే తరహాలో... ఆయా పార్టీలు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. మొత్తంగా 2019 ఎన్నికల వరకు ఈ అంశం సజీవంగా ఉండటమే కాకుండా... ప్రధాన ఎన్నికల నినాదంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.