జైట్లీ పై ఒత్తిడి.. హోదాపై త్వ‌ర‌లో నిర్ణయం

 

భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షా ఈరోజు ప‌లువురు కేంద్ర‌మంత్రుల‌తో భేటీ అయ్యారు. ఏపీ ప్రత్యేక హోదాపై తలెత్తుతున్న ఆందోళన నేపథ్యంలో ఆయన కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, వెంక‌య్య నాయుడు, సుజ‌నా చౌద‌రితో తన నివాసంలో చర్చలు జరిపారు. ముఖ్యంగా విభ‌జ‌న చ‌ట్టం అమ‌లు, విశాఖ రైల్వేజోన్‌, పోల‌వ‌రం ప్రాజెక్టుతో పాటు ప‌లు అంశాల‌పై చర్చించినట్టు తెలుస్తోంది. వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి ఇద్దరూ ప్రత్యేక హోదా విషయంలో జైట్లీపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోకుంటే రెండు మిత్రపక్షాలు తీవ్రంగా నష్టపోక తప్పదని వారు కాస్త గట్టిగానే చెప్పినట్టు తెలుస్తోంది.

 

ఈ సందర్బంగా కేంద్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రి మాట్లాడుతూ... చంద్రబాబు త‌న‌కు ఫోనులో ఇచ్చిన‌ ఆదేశాల మేర‌కు కేంద్ర‌మంత్రుల‌తో రాష్ట్ర వ్యవహారాలపై చ‌ర్చించామని తెలిపారు. కేంద్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా, ప్యాకేజీపై ఒక ముసాయిదా త‌యారుచేస్తోంద‌ని.. త్వ‌ర‌లో ఒక నిర్ణయం వెలువ‌డొచ్చని ఆయ‌న పేర్కొన్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.