హోదా గోదాలో రాజకీయ పక్షాలు

 

ప్రత్యేక హోదా... ఓ సంజీవని. ప్రత్యేక హోదా.. అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం. ప్రత్యేక హోదా... అట్టడుగున ఉన్న రాష్ట్రాల ఎదుగుదలకు ఉపకరించే ఒకే ఒక్క సాధనం. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రతిపక్షాలు కూడా ప్రత్యేక హోదాపై అంత పట్టుబడుతున్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు కూడా ప్రత్యేక హోదాపై ఉద్యమాలు చేయడానికి, కేంద్రంపై యుద్ధం ప్రకటించడానికి కారణం హోదాకున్న విలువే. భారతీయ జనతా పార్టీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుని ఆ తర్వాత నాలుగేళ్ల పాటు అక్కడ కేంద్రంలోనూ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లోనూ కూడా ప్రభుత్వంలో భాగస్వాములైన ఇరు పార్టీలు ప్రత్యేక హోదా కారణంగా కత్తులు నూరుకుంటున్నాయి. ప్రత్యేక హోదా కంటే, ప్రత్యేక ప్యాకేజీకే మొగ్గు చూపిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు హోదా పాట పాడుతోంది.

 

 

నాలుగేళ్ల స్నేహాన్ని  ప్రక్కన పెట్టి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే వరకూ వెళ్లింది. ప్రత్యేక హోదాకున్న  పవర్ ఏ పాటిదో ఈ సంఘటన తేటతెల్లం చేస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ తన అధికార దాహాన్ని ప్రత్యేక హోదా నీళ్లతో తీర్చుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీలో అతి కీలక సమావేశంగా భావించే సీడబ్ల్యూసీ సమావేశం కూడా ప్రత్యేక హోదా చుట్టూనే తిరిగింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఫైలుపై తొలి సంతకం చేస్తానని కాంగ్రెస్ ప్రధాన మంత్రి అభ్యర్ది రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ సమావేశంలోనే తమకూ ప్రత్యేక హోదా కావాలని ఒడిషా, బిహార్ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు పట్టుపట్టినా ఏకంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మండిపడ్డారు.

 

 

ఈ సంఘటనే ప్రత్యేక హోదాకున్న ప్రత్యేకతను తెలియజేస్తోంది. ప్రత్యేహోదాతోనే ఆంధ్ర‌ప్రదేశ్ లో పోగొట్టుకున్న ప‌వ‌ర్ ను తిరిగి రాబ‌ట్టుకోవాల‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకే ఇర‌త రాష్ట్రాల వారిని కూడా దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయ‌కూడ‌ద‌ని హుకుం జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వరాద‌ని పొరుగు రాష్ట్రం తెలంగాణ కూడా ప‌ట్టుబ‌డుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా తమ ఎంపీల చేత సభ్యత్వాలకు రాజీనామా చేయించింది.

 

 

అంతేకాదు మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ బంద్‌కు పిలుపునిచ్చింది. అన్నీ వర్గాల వారు ఈ బంద్‌కు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్. జగన్మోహన రెడ్డి ప్రకటించడం ఈ అంశానికి ఉన్న గొప్పతనమే. ఆయన ప్రత్యేక హోదాపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారు. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ‌్ రాజకీయాలలోకి దూకుడుగా వచ్చిన జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ప్రత్యేక హోదా  పైనే సమరం చేస్తున్నారు. వామపక్షాలు, మేథావుల సంఘాలు, ప్రజా సంఘాలు కూడా హోదా గోదాలో తలమునకలయ్యయి. ఇది ప్రత్యేక హోదాకున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది.