మోడీ నిజమా.. చంద్రబాబు నిజమా.. వెంకన్నకే తెలియాలి...!

 

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అన్యాయం చేసిందని... ఒకపక్క టీడీపీ నేతలు పోరాటం చేస్తూ ఉంటే... మరోపక్క బీజేపీ నేతలు మాత్రం టీడీపీ నేతలపై మాటల యుద్దం చేస్తూనే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే రెండు పార్టీల మధ్య  పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఆ వార్ ఇంకా కొనసాగుతూనే ఉందనుకోండి. ఇక ఇప్పుడు కొత్తగా మరో విషయంపై రెండు పార్టీలు మాటల యుద్దాలు మొదలుపెట్టారు.

 

రాష్టం విడిపోయిన తరువాత... మిత్రపక్షంగా ఉన్న సమయంలో రెండు పార్టీలు తిరుపతిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన మోడీ తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని కానీ ఇప్పుడు మాట మారుస్తున్నారని టీడీపీ నేతలు మొత్తుకుంటున్నారు. ఇక దీనిపై స్పందించిన బీజేపీ నేతలు ఊరుకుంటారా...? అందరికంటే ముందు సోము వీర్రాజు గారు ముందుంటారు కదా... ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని.. ఢిల్లీ తరహా రాజధాని నిర్మాణం చేస్తామని నాడు ప్రధాని మోదీ ఇచ్చిన హామీకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని.. అయితే తిరుపతి ఎన్నికలసభలో ప్రత్యేక హోదా ఇస్తామని నాడు నరేంద్రమోదీ ప్రకటన చేయలేదని అయితే వెంకన్న సాక్షిగా ప్రకటన చేసినట్లుగా సీ ఎం చంద్రబాబు నాయుడు ప్రజలను తప్పుదారి పట్టించేలా చేస్తున్నారని.. ఇలాంటి ప్రకటనలు మానుకోవాలని రాజు గారు అన్నారు. అంతేకాదు ఏడుకొండలవాని సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ చేయని ప్రకటనను తిరుపతిలో చేసినట్లు ఆమాటలకు వెంకన్న సాక్షి అన్నపదాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోడించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని... ఇకనైనా చంద్రబాబు వెంకన్న సాక్షి అనే పదాన్ని ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూద్దాం...

 

మరి రాజకీయనాయకుల మాటలకు అర్ధాలే వేరు... కాలికెస్తే మెడకు మెడకేస్తే కాలికి వెయ్యటం వారికి అలవాటే. ఇందులో ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో .. టీడీపీ నాయకులు రైట్ చెబుతున్నారా..? లేక బీజేపీ నేతలు రైటా అన్నది ఆ వెంకన్న కే తెలియాలి మరీ...!