అచ్చెన్నాయుడిపై స్పీకర్ ఫైర్.. స్పీకర్ కి బాబు సూటి ప్రశ్న!

 

బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఏపీ అసెంబ్లీలో గందరగోళం చోటు చేసుకుంది. అధికార, విపక్ష సభ్యులు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. మరోవైపు స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ నేత అచ్చెన్నాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఈరోజు సభ ప్రారంభంకాగానే టీడీపీ తరపున మాట్లాడే అవకాశం అచ్చెన్నాయుడికి ఇవ్వాలని స్పీకర్ ను చంద్రబాబు కోరారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతుండగా.. త్వరగా ముగించాలంటూ స్పీకర్ సూచించారు. తాను సబ్జెక్ట్ కే వస్తున్నానని.. లేకపోతే మీరే రాసివ్వండి, దాన్నే చదువుతానంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీరు రాసివ్వండి. నేను చదువుతాను. ఏం వ్యాఖ్యలు ఇవి' అని ప్రశ్నించారు. ఇదేమైనా బజారు అనుకుంటున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వ్యవహరిస్తే సభను నిర్వహించడం చాలా కష్టమవుతుందని స్పీకర్ అన్నారు.

అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా? అంటూ చంద్రబాబును ఉద్దేశించి స్పీకర్ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా తాను సమర్థించనని బాబు చెప్పారు. అదే సమయంలో తనపై వైసీపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపు మీరు సమర్థిస్తారా? అని స్పీకర్ ను బాబు ప్రశ్నించారు. ఒకప్పుడు సభలో మాట్లాడటానికి ఎన్టీఆర్ కు కూడా బాబు మైక్ ఇవ్వలేదని రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్ కు బాబు వెన్నుపోటు పొడిచిన విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశించే స్పీకర్ ను చంద్రబాబు ప్రశ్నించారు. అయితే స్పీకర్ ను బాబు ప్రశ్నించడాన్ని వైసీపీ నేత అంబటి రాంబాబు తప్పుబట్టారు. సభలో అత్యంత సీనియర్ అయిన నాయకుడు స్పీకర్ ను ప్రశ్నించడం ఏమిటని అంబటి అన్నారు.